వన్.. టూ.. థ్రీ.. స్టార్ట్ మెరుపు వేగం.. చిరుత వేగం.. రికార్డులు బలాదూర్.పతకాలు పారాహుషార్. కష్టాలను దాటొచ్చిన అనుభవం ఆమెను అలవోకగా హర్డిల్స్ దాటే అథ్లెట్‌గా తీర్చిదిద్దింది. ఆకలి బాధకు నకనకలాడిన పేగులు ఇప్పుడు గెలుపు కోసం ఆవురావురుమంటున్నాయ్! నిరుపేద కుటుంబంలో పుట్టి పతకాల వేటలో సివంగిలా దూసుకుపోతున్న పరుగుల రాణి ఆగసార నందిని ఇప్పుడు విజయ నందిని.
నందినిది నిరుపేద కుటుంబం. ఆమెకు మూడేండ్లున్నప్పుడు తల్లిదండ్రులు ఐలమ్మ, ఎల్లప్ప కర్ణాటకలోని బళ్లారి నుంచి పొట్టచేత పట్టుకొని హైదరాబాద్‌కు వలస వచ్చారు. సికింద్రాబాద్‌లోని కాప్రా సమీపంలో ఓ ఫ్లైఓవర్ కింద తలదాచుకున్నారు. ఎల్లప్ప సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరాడు. ఐలమ్మ నాలుగిండ్లలో పనులు చేసేది. తర్వాత ఇద్దరు కొడుకులు పుట్టారు. ఓ చిన్న ఇంట్లోకి మారారు. ఇన్ని కష్టాల్లోనూ ఎల్లప్ప దంపతులకు నందిని ఓ వరంగా అనిపించేది. చదువుల్లో రాణిస్తున్న కూతురు కండ్లలో వారికి ఉజ్వల భవిష్యత్తు కనిపించేది. ఆటల్లో అసాధారణ ప్రతిభ కనబరిచే బిడ్డను చూసి మురిసిపోయేవారు. అందుకే, తాను పస్తులున్నా కూతురును ప్రోత్సహించాలనుకున్నాడు ఎల్లప్ప. తండ్రి శ్రమను గుర్తించిన నందిని అంతే పట్టుదలతో కష్టపడేది.
బూట్లు లేకున్నా..
నందిని చదువు బొల్లారంలోని కేంద్రీయ విద్యాలయంలో సాగింది. అక్కడే తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. పాఠశాలలో ఏ ఆటల పోటీ జరిగినా నందిని పాల్గొనేది. ఆమె బరిలోకి దిగగానే మిగతా వారంతా ఓడిపోయామని ముందుగానే భావించేవారు. పాఠశాల నుంచి మండలస్థాయి, జిల్లా స్థాయిలోనూ ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ వచ్చింది. కుటుంబ నేపథ్యం పేదరికం కావడంతో సరైన పోషకాహారం ఉండేది కాదు ఆమెకు. బూట్లు కూడా లేని దుస్థితి. అయినా, పాదాలు కొట్టుకుపోతున్నా పరుగు ఆపేది కాదు. కూతురును ప్రోత్సహించాలనే లక్ష్యంతో తండ్రి ఎల్లప్ప సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం మానేసి సొంతంగా టీస్టాల్ ఏర్పాటు చేసుకున్నాడు.
అకాడమీ పిలుపుతో..
ఆర్థికంగా ప్రోత్సాహం కరువవ్వడంతో ప్రతిభ ఉన్నా నందిని పరుగు జిల్లాస్థాయిని దాటి ముందుకు సాగలేదు. కానీ, అనుకోని అదృష్టం ఆమె దశను మార్చేసింది. కేవీ స్కూల్లో జరిగిన గేమ్స్ మీట్లో నందిని ప్రతిభను గుర్తించాడు అక్కడికి వచ్చిన కోచ్ నాగరాజు. ఆమె గురించి ఆయన తన గురువు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేశ్‌కు వివరించగా వెంటనే నందినికి గచ్చిబౌలి అకాడమీ నుంచి పిలుపొచ్చింది. అదేసమయంలో ఆమెను నార్సింగిలోని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలో చేర్పించారు. అకాడమీలో నందిని ప్రతిభకు మెరుగులు దిద్డడం మొదలుపెట్టారు కోచ్ రమేశ్. ఆయన సారథ్యంలో హర్డిల్స్, హెప్టాథ్లాన్, లాంగ్‌జంప్, హైజంప్ తదితర విభాగాల్లోనూ నైపుణ్యాలను సాధించింది. ఆల్‌రౌండర్ అథ్లెట్‌గా ఎదిగింది. అధికారులు సైతం నందినికి కావాల్సిన వసతులను సమకూర్చారు. ఇక అప్పటి నుంచి నందిని వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ బరిలో నిలిచిన ప్రతిసారీ పతకాలను కైవసం చేసుకోవడం విశేషం. జూనియర్ అథ్లెట్‌గా జాతీయస్థాయి గుర్తింపు సాధించింది.
జాతీయస్థాయిలో..
ప్రత్యేక శిక్షణ తీసుకున్న తర్వాత నందిని మరింత రాటుదేలింది. 2019లో కర్ణాటకలో జరిగిన 31 సౌత్ జోన్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని జాతీయస్థాయిలో బరిలో నిలిచిన తొలి ఈవెంట్లోనే రికార్డును తిరగరాసింది. 5046 పాయింట్లతో హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణపతకం కైవసం చేసుకుంది. హర్డిల్స్ విభాగంలో రజత పతకం సాధించింది. అదే ఏడాది తమిళనాడులో జరిగిన 17వ ఫెడరేషన్ కప్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇలా ప్రతి ఈవెంట్లో పతకాలు సాధిస్తూనే వచ్చింది. కేరళలో జరిగిన జాతీయ పోటీల్లో లాంగ్‌జంప్‌లో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఏకంగా 6.20మీటర్లను లంఘించి జాతీయ స్థాయిలో గత రికార్డులను చెరిపివేసింది. ఇప్పటి వరకు పలు ఈవెంట్లలో పాల్గొని ఎనిమిది స్వర్ణపతకాలు, రెండు వెండి, ఒక కాంస్య పతకం సాధించి అథ్లెటిక్స్‌లో మన దేశ భవిష్యత్ ఆశాకిరణంగా నిలిచింది నందిని.
ఇంట్లో సాధన
ఆర్థిక కష్టాలు, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా నందిని వెనుదిరిగి చూడలేదు. ఫిట్నెస్ను కాపాడుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నది. కరోనా సమయంలో జిమ్‌లు మూతపడినా ఆమె సాధన ఆపలేదు. ఇంటినే మైదానంగా మలుచుకుంది. ఇంట్లోనే బకెట్లలో రాళ్లు, మట్టి నింపి బరువులు ఎత్తడం సాధన చేసింది. ఎత్తయిన పీటలను పెట్టుకొని హర్డిల్స్ ప్రాక్టిస్ చేసింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కసరత్తులు చేస్తూ బరువు పెరగకుండా, శారీరక దారుఢ్యాన్ని కాపాడుకుంది.
ఎన్నో త్యాగం చేశారు
మా నాన్న, అమ్మ ఎన్నో నా కోసం త్యాగాలు చేశారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాలని అనుకున్నా. గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, కోచ్‌లు రమేశ్, నాగరాజు సార్ల ప్రోత్సాహం మరచిపోలేను. వారు అండగా నిలబడటం వల్లే ఇక్కడి వరకు రాగలిగా. ఇప్పుడు నాముందున్న లక్ష్యం ఆసియా గేమ్స్. అందులో స్వర్ణం సాధించాలన్నదే నా కల. అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నా.
–నందిని
-మ్యాకం రవికుమార్