నడుము, చేతి వేళ్లు, మోకాళ్లు, మోచేతి దగ్గర నొప్పితో కొంతమంది బాధపడుతుంటారు. ఇలాంటి కీళ్ల నొప్పుల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఒకప్పుడు వయసు రీత్యా మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఇంతకీ ఈ కీళ్ల సమస్యలు ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు, వ్యాధిని నిర్ధారించే పద్ధతులతో పాటు ఏ స్పెషాలిటీ వైద్యులను సంప్రదించాలి? తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
ఎముకల్లో జాయింట్స్ (కీళ్ల)కు సంబంధించిన ఇన్ఫ్లమేషన్ను ‘ఆర్థరైటిస్’ అంటారు. కీళ్ల సమస్యల్లో చాలారకాలు ఉన్నాయి. కీళ్ల సమస్యకు కారణాన్ని బట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్‌గా వాటిని విభజించారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సర్వసాధారణంగా వస్తుంది. రోగ నిరోధక శక్తికి సంబంధించిన కణాలు వ్యాధి కారకాలపై దాడిచేయడంతో పాటు శరీరంపై కూడా దాడి చేస్తాయి. ఆ రోగ నిరోధక వ్యవస్థ ప్రభావం వల్ల కీళ్ల సమస్యలు వస్తాయి. ఇది కాకుండా లూపస్, స్లీరోడర్మ, మయోసైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కూడా ఆటో ఇమ్యూన్ (రోగ నిరోధక వ్యవస్థ వల్ల కలిగే) వ్యాధులే. వీటి కారణంగా కీళ్ల నొప్పులు రావచ్చు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్
కీళ్ల వాతం వల్ల ఈ సమస్య వస్తుంది. మహిళలకు ఎక్కువగా వస్తుంది. 30 – 40 ఏళ్ల వయసులో మొదలవుతుంది. దీనిని రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటి పీసీసీ పరీక్షలతో నిర్ధారిస్తారు.
లక్షణాలు
ఆస్టియో ఆర్థరైటిస్
వయసు రీత్యా వచ్చే కీళ్ల నొప్పులను ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. సాధారణంగా ఇది వృద్ధుల్లో వచ్చే రుగ్మత. కీళ్ల అరుగుదల వల్ల ఈ సమస్య వస్తుంది. వయసు పెరిగే కొద్ది కీళ్లు అరుగుదలకు గురవుతాయి. దీనివల్ల మోకాళ్ల నొప్పులు, తుంటి నొప్పి, నడుము నొప్పితో బాధపడుతుంటారు. శరీర బరువు అధికంగా ఉంటే మోకాళ్ల మీద ఎక్కువ బరువు పడుతుంది. గతంలో బరువులు మోసే పనులు ఎక్కువగా చేయడం, మోకాళ్లకు దెబ్బలు తగలడం, ఇతర కారణాల వల్ల మోకాలి కీళ్లు అరుగుతాయి. దీనికి ఎలాంటి రక్త పరీక్షలు అవసరం లేదు. ఎక్స్రేతోనే నిర్ధారిస్తారు.
గౌట్ ఆర్థరైటిస్
మగవాళ్లలో ఈ సమస్య ఉంటుంది. కాలి బొటన వేళ్లలో ఈ సమస్య మొదలవుతుంది. పడుకునే ముందు కొద్దిగా నొప్పి ఉంటుంది. నిద్రలేచే సమయానికి తీవ్రంగా ఉంటుంది. లేచి నడవలేని స్థితి ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల ఈ గౌట్ ఆర్థరైటిస్ వస్తుంది. మహిళలకు నెలసరి (రుతుస్రావం) ఆగిపోనంత కాలం గౌట్ ఆర్థరైటిస్ రాదు. మెనోపాజ్ దశ వచ్చిన తర్వాత రావొచ్చు. ఈ సమస్యకు ఆహార నియమాలే ఔషధం.
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్
ఈ సమస్య 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారిలో వస్తుంది. ఎక్కువగా నడుము నొప్పితో ప్రారంభమవుతుంది. ఈ సమస్య జన్యు
సంబంధమైనది.
లక్షణాలు
నడుములో కొన్నిసార్లు ఎడమ వైపు, మరికొన్నిసార్లు కుడివైపు నొప్పి వల్ల నిద్రలో నుంచి లేవడం ఉదయం లేవగానే నడుము పట్టేయడం లేచిన తర్వాత అరగంట వరకు కదల లేకపోవడం సమస్య తీవ్రమయ్యే కొద్దీ వెన్నుపూస, మెడకు నొప్పి విస్తరించడం కొందరిలో మోకాలు, తుంటి, పాదాల్లో కూడా నొప్పి కలుగుతుంది.
ఎవరిని సంప్రదించాలి?
కీళ్ల నొప్పులు వచ్చినప్పుడు ‘ఎముకల (ఆర్థో) వైద్యులను సంప్రదించాలా? రుమటాలజిస్టులను సంప్రదించాలా?’ అనే సందేహం చాలామందిలో ఉంది. ఏవైనా గాయాలైనప్పుడు ఎముకలు విరిగితే, దెబ్బతింటే ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి గాయాల బారినపడకుండానే కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే రుమటాలజీ వైద్యులను సంప్రదించాలి. ఇది దీర్ఘకాలిక వ్యాధి. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. కానీ, సకాలంలో చికిత్స తీసుకుంటే వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చు. పది పదిహేనేళ్ల నుంచి ఆర్థరైటిస్‌కు ప్రత్యేక చికిత్స అందుబాటులోకి వచ్చింది.
నిర్లక్ష్యం చేస్తే..
కీళ్ల నొప్పులను నిర్లక్ష్యం చేస్తే ఆది ప్రధాన అవయవాలపై ప్రభావం చూపవచ్చు. ఆర్థరైటిస్‌ను నిర్లక్ష్యం చేస్తే చర్మవ్యాధులు, రక్త కణాలు తగ్గిపోతాయి. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముంది. నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. గుండె, ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు వస్తాయి.
చికిత్స
ఆర్థరైటిస్ వ్యాధులను పూర్తిగా తగ్గించే వైద్య చికిత్స లేదు. ప్రారంభ దశలో గుర్తిస్తే వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చు. మంచి జీవన శైలిని అలవర్చుకుని, ఆహార నియమాలు పాటిస్తూ, ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ పద్ధతులు పాటించాలి. అనుభవజ్ఞులైన రుమటాలజీ వైద్యుల పర్యవేక్షణలో సరైన పద్ధతిలో మందులు వాడితే దుష్ప్రభావాలు లేకుండా ఆర్థరైటిస్‌ని నియంత్రణలో ఉంచుకోవచ్చు –మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ మాధురి
రుమటాలజిస్ట్, స్టార్ హాస్పిటల్
నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్