ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ భారతీయురాలే, ఆ పేరొందిన సంస్థ చైర్ పర్సన్ మహిళే… అనే మాటలు వినిపించే వేళ కొందరి పేర్లు గుర్తుకురాకపోవచ్చు. అంతమాత్రాన వారి ప్రతిభకు వచ్చిన ఢోకా ఏం లేదు. అలాంటి ఓ అరుదైన వ్యక్తిత్వం.. అన్షుల కాంత్. ఆర్థికశాస్త్రంలో ఉన్నతవిద్యను అభ్యసించాక, భారతీయ స్టేట్ బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్గా చేరారు. అనతికాలంలో బోర్డ్ మెంబర్ స్థాయికి ఎదిగారు. 2019లో ప్రపంచ బ్యాంక్ సమూహానికి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులయ్యారు.
అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే ఈ సంస్థల ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడం అంత సులభం కాదు. వివిధ దేశాలకు రుణాలు మంజూరు చేయడం, సామాజిక సంక్షోభాల పరిష్కారానికి పనిచేసే ఎన్జీవోలకు ఆర్థిక సాయం అందించడం సామాన్య విషయం కాదు. పేదరికం నుంచి నిరక్షరాస్యత వరకు ప్రపంచ దేశాలు ఎదుర్కొనే సవాళ్లన్నిటికీ జవాబు వెతకడంలో ప్రపంచ బ్యాంక్ పాత్ర చాలా కీలకం. ‘ఈ సమస్యల్ని పరిష్కరించడం అంత తేలిక కాదు. చాలా సమయమే తీసుకుంటుంది. కానీ పనైతే మొదలుపెట్టాం’ అంటారు అన్షుల. తను బాధ్యతలు చేపట్టిన తర్వాతే కొవిడ్ లోకాన్ని కుదిపేసింది, దాన్నుంచి కోలుకునేలోగా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధాలు విరుచుకుపడ్డాయి. అయినా అన్షుల వెనక్కి తగ్గడం లేదు.