ఆమెది చిన్న ఉద్యోగమే కావచ్చు. కానీ, ఆలోచనలు సువిశాలం. అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తూనే.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. పెండ్లయినా, పేరంటమైనా, సంతోషమైనా, ఆపదైనా వెంటనే వాలిపోయి ఆర్థిక సాయం చేస్తారు. ఆమె అభిమతానికి మతం అడ్డురాదు. రంజాన్ మాసంలో ఎంత ఉదారంగా జకాత్ చెల్లిస్తారో, వినాయక చవితికి అంతే అభిమానంగా చందాలు ఇస్తారు మహ్మద్ సుల్తానా ఉమర్. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్‌లో పనిచేస్తున్నారామె.
భర్త ఉమర్ మెకానిక్. ఇద్దరూ అనాథలకు, ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం చేస్తారు. సుల్తానా రక్తదాత కూడా. అంతే కాదు, రక్తదానం చేసే యువతకు పండ్లు పంపిణీ చేస్తారు. కరోనా సమయంలో ఎంతోమందికి నిత్యావసర సరుకులు అందించారు. ఖాళీ సమయంలో యువత పెడదారులు పట్టకుండా.. ఆటల పట్ల ఆసక్తిని పెంచుకునేలా క్రీడా పరికరాలు అందించారు. అత్యవసర సమయాల్లో ఆదుకునే అంబులెన్స్ సిబ్బందికి చేదోడుగా నిలిచారు. అనాథ బాలికలకు ఆర్థికంగా సాయం అందించిన ఉదాహరణలూ అనేకం. ‘ఈ సేవా కార్యక్రమాలు నాకెంతో సంతృప్తిని ఇస్తాయి’ అని సంతోషంగా చెబుతారు సుల్తానా ఉమర్.