ఏదో సినిమా స్టార్లా నటించాల్సిన అవసరం తన తల్లికి లేదనీ.. ఆమె ఎప్పుడూ రియల్ స్టారేననీ అంటున్నది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే! ‘ద ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ పేరుతో వచ్చిన టెలివిజన్ సిరీస్‌లో మెరిసింది అనన్య పాండే తల్లి.. వందన పాండే! దాంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. నటిగా బిజీగానూ మారిపోయింది. ఈ క్రమంలో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తనకూ, తన తల్లికీ మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చింది. వాళ్ల అమ్మ ఎంత బిజీగా మారినా.. తమకోసం కచ్చితంగా సమయం కేటాయిస్తుందని చెప్పింది. “నాకు మార్గదర్శకులు, నా చిత్రాలకు ఉత్తమ విమర్శకురాలు మా అమ్మే! నేను తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ.. మా అమ్మ ఇచ్చే ఇన్పుట్స్ కచ్చితంగా ఉంటాయి” అంటూ, తన సినీ కెరీర్లో వాళ్ల అమ్మ కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పుకొచ్చింది.
ఇంకా మాట్లాడుతూ.. “సినీతారల జీవితాలు తెరిచిన పుస్తకాల్లానే ఉంటాయి. వారి గురించి ఏ విషయాలూ దాచడానికి ఉండదు. నేను కూడా అంతే! ఏదైనా దాచడం, అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి అవకాశం.. అవసరం కూడా నాకు లేదు. మా అమ్మ ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యింది. అయినా.. మా ఇంట్లో ఏమీ మారలేదు. ఆమె ఎంత బిజీగా ఉన్నా.. నాకు కావాల్సిన సహాయం చేస్తుంది. షూటింగ్లో ఉన్నాననో.. బిజీ అనో ఎప్పుడూ చెప్పదు!” అంటూ తల్లి గురించి చెప్పుకొచ్చింది. ఇక వృత్తిపరంగా.. బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అనన్య.. పలు విజయవంతమైన సినిమాలతో అలరించింది. తెలుగులోనూ విజయ్ దేవరకొండ సరసన లైగర్‌లో అలరించింది.