సినిమాల్లో కన్నా.. సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. నెపోటిజం.. కాస్మెటిక్ సర్జరీ.. బాడీ షేమింగ్.. ఇలా నిత్యం ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా, కెరీర్ తొలినాళ్లలో చాలామంది హీరోయిన్లలానే తానుకూడా బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నాననీ చెప్పుకొచ్చింది. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. “నేను చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఆ 18 – 19 ఏళ్ల వయసులో నేను చాలా సన్నగా ఉండేదాన్ని. దాంతో ఇండస్ట్రీలో చాలామంది నా శరీరంపై కామెంట్స్ చేశారు. అగ్గిపుల్లలా ఉన్నానంటూ ఆటపట్టించారు.
‘నీ కాళ్లు కోడికాళ్లలా ఉన్నాయి. నీ శరీరం కూడా సరైన ఆకారంలో లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడేమో నా శరీరం సహజంగానే మారుతుంటే.. ‘ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది’ అంటున్నారు. ఆడవాళ్లు ఎలా ఉన్నా.. ఇలాంటి విమర్శలు కామన్. కాబట్టి, పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతేనే.. విజయం సాధిస్తాం!” అంటూ చెప్పుకొచ్చింది అనన్య.
ఇక మగవాళ్లపై బాడీ షేమింగ్ విమర్శలు చాలా తక్కువగా ఉంటాయనీ, ఒకటో రెండో వచ్చినా.. వారిని అంతగా ఇబ్బంది పెట్టరనీ అంటున్నది. అదే, మహిళా నటులపై తరచుగా విమర్శలు గుప్పిస్తూనే ఉంటారనీ, వారిని ఎదగనీయకుండా అడ్డుకుంటారనీ ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది అనన్య. 2019లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం ద్వారా బాలీవుడ్ బాట పట్టింది. తొలి సినిమాలోనే తనదైన నటనతో అలరించింది.
ఆ తర్వాత.. పతి పత్నీ ఔర్ వో, ఖాలీ పీలీ, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, డ్రీమ్ గర్ల్ 2, ఖో గయే హమ్ కహా లాంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇటీవలే అక్షయ్ కుమార్ సరసన కేసరి – చాప్టర్ 2లో కనిపించింది. ప్రస్తుతం లక్ష్య్ సరసన ‘చాంద్ మేరా దిల్’ కోసం సిద్ధమవుతున్నది అనన్య. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సోని దర్శకత్వం వహిస్తున్నాడు.