అందానికి, అభినయానికి కేరాఫ్ అనన్యా పాండే. అరడజను సినిమాలతోనే తారాపథం అందుకుంది. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్క్వీన్లా మెరిసిపోతున్నది. ప్రేక్షకులను సమ్మోహనపరుస్తున్నది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’లో నటిస్తున్న అనన్య పంచుకున్న అనుభవాలివి..
ఈ మధ్యే నాకు 23 ఏండ్లు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే నాలో ఏదో తెలియని మార్పు. గడచిన ఆరునెలల్లో చాలా మారిపోయా. నా ఆలోచనలు, ప్రతిస్పందనల్లో గుర్తించదగిన మార్పు వచ్చింది. ఇందుకు, బహుశా కరోనా కారణం కావొచ్చు. లాక్డౌన్ మొదట్లో కాస్త ఒత్తిడికి గురైన మాట వాస్తవమే. ఇప్పుడిప్పుడే మొదలైన నా కెరీర్ ఏమవుతుందో అని కంగారుపడ్డాను. కానీ, రోజులు గడిచేకొద్దీ అంతా మామూలే అనిపించింది. కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాను.
గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు డైట్ సూత్రాలు పాటించాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వారంలో ఆరు రోజులు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేదాన్ని. ఆదివారం మాత్రం కండిషన్స్ పక్కన పెట్టేసేదాన్ని. నచ్చినంత తినేసేదాన్ని. తర్వాత నాకే ఇలా ఆరు రోజులు కఠిన నియమాలు పాటించడం ఎందుకు, ఆదివారం అతిగా తినడం ఎందుకు అనిపించింది. అప్పటి నుంచీ నచ్చినవన్నీ మితంగా తింటూ, వ్యాయామం చేస్తూ హాయిగా ఉంటున్నా!
నటిగా నేను చాలా గర్వపడతాను. అయితే, ఫేమ్ రావడంతో బయట స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాననే బాధ మాత్రం ఉంది. ఇప్పుడిప్పుడే నా ఆలోచనలు సరైన పంథాలో సాగుతున్నాయి. కొన్ని ఇంటర్వ్యూల్లో పిచ్చిపిచ్చి సమాధానాలు ఇచ్చే ఉంటాను. పైగా బయటకు వెళ్లినప్పుడు జనాన్ని తప్పించుకునే ప్రయత్నంలో విసుక్కున్న సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ బయటి వ్యక్తులు నన్ను అపార్థం చేసుకునేందుకు కారణం అయి ఉంటాయి. కానీ, నేనున్న పరిస్థితిని అర్థం చేసుకుంటే, నా ప్రవర్తన తప్పని అనిపించకపోవచ్చు.
కుటుంబసభ్యులతో, స్నేహితులతో సరదాగా ఉంటాను. నా చుట్టూ ఉన్నవారిని బాగా నవ్విస్తాను. కాస్త అల్లరి పిల్లనే! నా స్కూల్ ఫ్రెండ్స్‌తో ఇప్పటికీ చాలా క్లోజ్‌గా ఉంటాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా మా స్నేహంలో ఎలాంటి తేడా లేదు. వయసును బట్టి, అనుభవాలను బట్టి వ్యక్తిత్వం పరిణతి చెందుతుంది. అందులో అనుమానం లేదు. అంతేకానీ మనలోని మంచితనం, సహజ గుణం ఎప్పటికీ మారవు.
స్నేహితులతో సరదాగా ఉంటాను కానీ, కొత్తవారితో కలవడానికి మాత్రం కొంత ఇబ్బందిపడతాను. ఏదైనా ఈవెంట్‌కు వెళ్లినప్పుడు ఓ పది నిమిషాలపాటు చాలా నెర్వస్‌గా ఫీలవుతాను. ‘ఎందుకొచ్చాన్రా భగవంతుడా’ అనిపిస్తుంటుంది. కానీ, ఒకరిద్దరితో మాట్లాడిన తర్వాత మళ్లీ మామూలైపోతాను. అందరితో కలివిడిగా మాట్లాడుతాను.
రోజూ పడుకునే ముందు ప్రార్థన చేస్తాను. చిన్నప్పటి నుంచీ నాకు ఈ అలవాటు ఉంది. అలాగని ధ్యానం చేస్తూ ఉండిపోను. ఆ రోజు జరిగినవన్నీ ఒకసారి రీకాల్ చేసుకొని, దేవుడికి కృతజ్ఞతలు చెప్పి పడుకుంటాను. ఏమైనా చేదు అనుభవాలు ఉంటే, వాటిని అక్కడితో వదిలేస్తాను.
నా చెల్లెలు రాస్య నా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పుడు కీచులాడుకున్నా.. చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఇప్పుడు, మరింత క్లోజ్ అయ్యాం. నాకు మంచి స్నేహితురాలు. చక్కని సలహాలు ఇస్తుంటుంది. చాలా కూల్‌గా ఉంటుంది. మా ఇద్దరి మధ్య తేడా ఐదున్నరేండ్లు! తన ఆలోచనలు చూస్తుంటే జనరేషన్ గ్యాప్ ఉన్నట్టే అనిపిస్తుంది.