మనదేశంలో ట్రావెలింగ్ ట్రెండ్ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నది. గతంతో పోలిస్తే.. యాత్రలు చేసేవారి సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఇండియన్ ట్రావెల్ ట్రెండ్స్‌పై.. తాజాగా ఓ అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరం కన్నా వచ్చే ఏడాదిలో మరింత ఎక్కువగా ట్రావెల్ చేయాలని భారతీయ యాత్రికులు అనుకుంటున్నారట. దాదాపు 59 శాతం మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారట.
2025తో పోలిస్తే మరింత ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో బడ్జెట్‌పైనా పూర్తి అవగాహనతో ఉన్నారు. ఆహారానికి అధిక ఖర్చు పెడుతున్నట్లు 63 శాతం మంది చెప్పగా.. ఆ తర్వాత విమాన ఖర్చులు (60 శాతం), వసతి (56 శాతం), వీసా అవసరాలు (48 శాతం) నిలిచాయి. ఇక భారతీయ పర్యాటకుల్లోని ప్రతి ముగ్గురిలో ఒకరు..
రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా వెళ్తున్నారు. నిశ్శబ్దమైన, ప్రామాణికమైన ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడంలో ఎక్కువ శాతం మంది డిజిటల్ సాధనాలను నమ్ముకుంటున్నారు. 2026లో తమ టూర్ల కోసం ఏఐని ఉపయోగించనున్నట్లు 86 శాతం మంది వెల్లడించారు. ఇక యాత్రల్లో భాగంగా.. 73 శాతం మంది లోకల్ ఫ్లేవర్స్‌ను ఆస్వాదించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చర్మ సంరక్షణ కోసం విదేశాలలో పర్యటిస్తున్నట్లు 57 శాతం మంది భారతీయ ప్రయాణికులు వెల్లడించారు. ట్రెక్కింగ్, స్కీయింగ్ లాంటి సాహస యాత్రలకూ మనవాళ్లు సై అంటున్నారు. ఈ రకమైన పర్యటనలు చేయడానికి 92 శాతం మంది మూటా ముళ్లే సర్దేసుకుంటున్నారు.