బాలీవుడ్‌లోని అత్యంత విజయవంతమైన జంటల్లో అమితాబ్-రేఖ అగ్రస్థానంలో ఉంటారు. వీరిద్దరూ కలిసి 11 సినిమాల్లో తెరను పంచుకున్నారు. హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఆన్స్క్రీన్తోపాటు ఆఫ్‌స్క్రీన్‌లోనూ అమితాబ్-రేఖ.. ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచేవారు. అందుకు కారణం.. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారమేనని బీటౌన్వాసులు ఇప్పటికీ చెవులు కొరుక్కుంటారు. వారి అనుమానాలను బలపరిచే పలు సందర్భాలనూ బయట పెడుతుంటారు. అలాంటి ఒక సంఘటనే తాజాగా ఒకటి బయటికొచ్చింది.
అమితాబ్-రేఖ జంటగా 1981లో ‘సిల్సిలా’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటికే బిగ్ బీకి జయాబచ్చన్‌తో వివాహమైంది. అమితాబ్-రేఖ మధ్య ప్రేమ పుకార్ల నేపథ్యంలో.. వీరిద్దరూ కలిసి నటించడానికి జయాబచ్చన్ కొన్ని షరతులు పెట్టిందట. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత హనీఫ్ జవేరి, అతని మేనకోడలు జిగ్నా.. ఇటీవల మీడియాతో పంచుకున్నారు. “మొదట్లో ‘సిల్సిలా’ కోసం అమితాబ్ సరసన స్మితా పాటిల్, పర్వీన్ బాబీ నటించాల్సి ఉంది. కానీ, సినిమా కథాంశం అమితాబ్-రేఖ నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. దాంతో, అమితాబ్-రేఖ కలిసి నటించడం అనివార్యమైంది” అని చెప్పుకొచ్చారు.
అయితే, వారిద్దరూ కలిసి నటించాలంటే.. తాను ఎప్పుడూ సెట్లోనే ఉండాలన్న షరతు విధించిందట జయాబచ్చన్. దాంతో, మరో పాత్రకు జయను ఎంచుకున్నారు. ‘సిల్సిలా’ విషయానికి వస్తే.. భారీ తారాగణం, అంతకు మించిన అంచనాలతో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత అమితాబ్-రేఖ కలిసి మళ్లీ వెండితెరను పంచుకోలేదు. ఈ విషయంపై రేఖ కూడా వివిధ సందర్భాల్లో మాట్లాడింది. “సిల్సిలా తర్వాత మేము ఎందుకు కలిసి పని చేయలేదని అభిమానులు ఎప్పుడూ అడుగుతుంటారు. వారికి నేను ఒక్కటే చెప్పేదాన్ని. అమితాబ్‌తో కలిసి నటించాలంటే.. వేచి ఉండాల్సిందే! సహనం పాటించాల్సిందే!” అంటూ చెప్పుకొచ్చింది.