నేటితరం నటుల ఫోకస్ అంతా సోషల్ మీడియాపైనే ఉందనీ.. దాన్ని వదిలేసి వెండితెరను ఏలాలని పిలుపునిస్తున్నది సీనియర్ నటి అమీషా పటేల్. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోషల్ మీడియా, బాలీవుడ్ యాక్టర్స్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమ తరానికి, ప్రస్తుత తారలకూ మధ్య ఉన్న తేడాలను చెప్పుకొచ్చింది. “మేము సినిమాలు చేస్తున్నప్పుడు సోషల్ మీడియా కన్నా.. వెండితెరపై ప్రదర్శనలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. కానీ, ఇప్పటివాళ్లు కళపై దృష్టి పెట్టడం కన్నా.. సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఆన్లైన్లో తమ ఇమేజ్ను కాపాడుకోవడంలోనే ఎక్కువగా నిమగ్నం అవుతున్నారు” అంటూ విమర్శించింది. ఇంకా.. “నేటితరం వారి ఇన్స్టాగ్రామ్ పోస్టుల గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. షూటింగ్ మధ్యలో రీల్స్ చేయడం, వారి మేకప్ వ్యాన్‌లో ఏం జరుగుతున్నదో.. వారి మేకప్ ఆర్టిస్ట్, స్టయిలిస్ట్ ఎలా పనిచేస్తారో చూపించడంపైనే ఎక్కువ దృష్టిపెడుతున్నారు. అందుకే, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నారు. ఎప్పుడూ రీల్స్‌లో కనిపించే ఇలాంటి నటులకోసం టిక్కెట్లు కొనడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపడంలేదు. అందుకే, కొత్త నటులు బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు సాధించడం లేదు!” అంటూ విమర్శలు గుప్పించింది.
తమకాలంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి సీనియర్ నటులు.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతం అయ్యారని చెప్పుకొచ్చింది. తనతోపాటు ప్రీతీజింటా, రాణీ ముఖర్జీ, కరీనా కపూర్‌లాంటి నటులంతా.. పార్టీలూ, ఈవెంట్లలో కనిపించడానికి ప్రాధాన్యం ఇవ్వలేదనీ, కాబట్టే ప్రజలు ఇప్పటికీ వారిని చూడాలని కోరుకుంటున్నారనీ అంటున్నది. “అమితాబ్, ధర్మేంద్ర వంటి సూపర్స్టార్ల జమానాలో.. ఇలాంటి టీవీ చానెళ్లు, ఇంటర్వ్యూలు కూడా లేవు. అయినప్పటికీ ప్రేక్షకులు వారిపై పిచ్చి అభిమానంతో ఉండేవారు. వారి సినిమాలు వెండితెరపైకి వచ్చినప్పుడు.. రికార్డులను తిరగరాశాయి. సోషల్ మీడియా అనేది ఒక సాధనం మాత్రమే.. అదే జీవితం కాదన్న సత్యాన్ని నేటితరం గుర్తించాలి” అని హితబోధ చేసింది.