‘గదర్ 2’ చిత్రీకరణ సందర్భంగా.. తన జీవితంలో పీడకల లాంటి ఓ సంఘటన జరిగిందని చెప్పుకొచ్చింది బాలీవుడ్ తార అమీషా పటేల్. లొకేషన్లో ఉన్నవాళ్లంతా తాను చనిపోయాననే అనుకున్నారని వాపోయింది. ఆ సమయంలో సన్నీ డియోల్.. నిజమైన హీరో అవతారమెత్తి తనకు సహాయం చేసినట్టు చెప్పింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీషా పటేల్ మాట్లాడుతూ.. ‘గదర్ 2’ షూటింగ్ సందర్భంగా జరిగిన ఆ సంఘటనను పంచుకున్నది. అమీషాకు మొదట్నుంచీ చలి వాతావరణం పడదు. అయినా.. ‘గదర్ 2’లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి అటవీ ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటంతో.. అమీషా తనకున్న సమస్య గురించి డైరెక్టర్‌తో ముందే చెప్పిందట. తాను చల్లని వాతావరణంలో ఇట్టే జబ్బు పడతాననీ.. వర్షం పడే సీన్లో నీళ్లు వేడిగా ఉండేలా చూడాలని కోరిందట. కానీ, షూటింగ్ సందర్భంగా వాళ్లపై కురిపించిన వర్షం నీళ్లు.. గడ్డ కట్టేంత చలిగా ఉన్నాయట. “దాంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా! గజగజ వణికిపోతూ స్పృహతప్పి పడిపోయా! అక్కడున్న సిబ్బంది వెంటనే నన్ను నా మేకప్ వ్యాన్‌లోకి తీసుకెళ్లారు. దాదాపు మూడునాలుగు గంటలవరకూ స్పృహలోకి రాలేదు! అదో భయంకరమైన సంఘటన!” అంటూ అమీషా గుర్తు చేసుకున్నది.