డోర్ మ్యాట్ దగ్గర్నుంచి డబుల్ కాట్ వరకూ.. హెయిర్ పిన్ దగ్గర్నుంచి ఫ్యాన్సీ వడ్డాణం వరకూ.. అన్నీ ఆన్లైన్లో కొంటున్నాం. ఇందులోనూ అమెజాన్ అంగడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు! కోరుకున్నవన్నీ గుమ్మం ముందుకు తెస్తున్న అమెజాన్‌లో భిన్నమైన ఫీచర్లు చాలా ఉన్నాయి. వాటి సాయంతో మనకు కావాల్సినవి మరింత సులువుగా వెతకొచ్చు. అదెలాగో చూద్దాం.
ఒకసారి యాప్‌లోని సెర్చ్బార్ని ట్యాప్ చేయండి. అక్కడ ‘సెర్చ్ విత్ ఫొటో’, ‘సెర్చ్ విత్ కెమెరా’ ఆప్షన్లు కనిపిస్తాయి. కొనాల్సిన వాటిని సెర్చ్బార్లో టైప్ చేసి, వాయిస్ కమాండ్స్‌తో వెతికినట్లే కొనాలనుకున్న వస్తువు పేరు తెలియకపోతే? దాన్ని ఎలా వెదకాలి? సింపుల్.. సెర్చ్ విత్ కెమెరా ఆప్షన్ని ట్యాప్ చేయాలి. యాప్‌లోనే ఫోన్ కెమెరా ఓపెన్ అవుతుంది. దేన్ని ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని ఫొటో తీస్తే చాలు.. అలాంటి ఉత్పత్తులు స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఆ తరహా ప్రొడక్టులు క్షణాల్లో ముందుంటాయి.
‘సెర్చ్ విత్ ఫొటో’లో ఫోన్ కెమెరాతో ఫోటో తీసి సెర్చ్ చేయడమే కాదు ఫోన్లో ఉండే ఫొటోల్లో ఉన్న ఉత్పత్తులు కొనాలన్నా వెతకొచ్చు. ఉదాహరణకు బ్రౌజింగ్‌లో ఇష్టమైన డ్రెస్ కనిపించింది. అది అమెజాన్‌లో ఉందేమో వెతకాలంటే ఇమేజ్‌పై ట్యాప్ చేసి షేర్ సెలెక్ట్ చేయండి. వచ్చిన షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ‘Find Products on Amazon’ ట్యాప్ చేస్తే కోరుకున్న దుస్తులు వచ్చేస్తాయి.
అగ్మెంటెడ్ రియాలిటీ తెలుసుగా! ఆధునిక టెక్నాలజీ సాయంతో బాహ్య ప్రపంచాన్ని చూడటం. ఉదాహరణకి హాల్లో పెట్టుకునేందుకు ఓ సోఫా కొనాలని అనుకున్నారు. అమెజాన్‌లో వెతికారు.. సోఫా బాగా నచ్చింది. కానీ, హాల్‌కు సరిపోతుందో లేదో తెలియదు. కాబట్టి ఆర్డర్ పెట్టాలంటే సందేహం. ‘ఏఆర్’తో అది సాధ్యమే! అమెజాన్ యాప్‌లోని ‘View in Your Room’ ఫీచర్‌ని ట్యాప్ చేయండి. ఫోన్ కెమెరాతో హాలుని షూట్ చేయండి చాలు. మీరు సెలెక్ట్ చేసిన సోఫాను హాలులోపెట్టినట్టుగానే చూపిస్తుంది. నచ్చితే ఆర్డర్ పెట్టొచ్చు. ఇలా కుర్చీలు, ఇంటీరియర్ డెకరేషన్ ఐటమ్స్‌ని ‘ఏఆర్’లో చూశాకే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అయితే, ఎంపిక చేసిన ప్రొడక్టులను మాత్రమే ఇలా ఏఆర్‌లో చూసుకునే సదుపాయం ఉంది.
అమెజాన్ యాప్‌లోని మెయిన్ మెనూని ఎప్పుడైనా గమనించారా? షాపింగ్ మరింత సులభతరం చేసేలా చక్కని ఫీచర్స్‌ని జోడించింది. విభాగాల వారీగా ఉత్పత్తులు కనిపించడమే కాదు. కింద వరుసగా బటన్ ట్యాబ్స్ కనిపిస్తాయ్. ముందు ‘ఆర్డర్స్’ ట్యాబ్‌లో మీరు చేసిన అన్ని ఆర్డర్లనూ ఒక్క ట్యాప్‌తో పొందొచ్చు. అలాగే, కొనే వాటిలో ఉప్పు, పప్పు ఉంటే.. వాటిని ప్రతిసారీ విడిగా ఆర్డర్ పెట్టనక్కర్లేదు. సింపుల్‌గా ‘Repeat Again’ ట్యాబ్‌లోకి వెళ్లొచ్చు. అంతేకాదు.. సరుకుల చిట్టా ఎలాగైతే రాసుకుంటామో.. Lists ట్యాబ్‌లో మనకు కావాల్సిన వస్తువుల జాబితా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే వాటికి సంబంధించిన బెస్ట్ డీల్స్‌ని అమెజాన్ మనకు తెలియజేస్తుంది. ఆఫర్ నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేయొచ్చు.
ఏ వస్తువైనా రివ్యూలు చూసి, ఓకే అనుకుంటేనే ఆర్డర్ చేస్తుంటాం. ఇకపై అమెజాన్‌లో వస్తువులకు సంబంధించిన క్రేజ్‌ని తెలిపేందుకు మూడో పేరామీటర్ వచ్చింది. ‘సేల్స్ ట్రెండ్ డేటా’ పేరుతో ఆ వస్తువును ఎంతమంది కొన్నారో తెలియజేస్తుంది. దాని ఆధారంగా వస్తువుకు ఉన్న క్రేజ్ ఆధారంగా ఆర్డర్ పెట్టొచ్చన్నమాట.