కొత్త దుస్తులతోపాటే కొత్త సమస్యలూ వస్తాయి. చాలామంది ఫిటింగ్కు తగ్గట్టుగానే దుస్తులను ఎంచుకుంటారు. కొలతల ప్రకారమే టైలర్ దగ్గర కుట్టించుకుంటారు. కానీ, మొదటి ఉతుకు తర్వాత దుస్తులు కాస్త చిన్నవిగా మారిపోయినట్లు గుర్తిస్తారు. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నది. తాజాగా, కొత్త బట్టలు కుంచించుకుపోవడానికి గల కారణాలను పరిశోధకులు కనుగొన్నారు.
కొత్త బట్టల్ని మొదటిసారి నీటిలో ఉతికినప్పుడు కుంచించుకుపోవడం సాధారణ సమస్యే. ముఖ్యంగా కాటన్, లెనిన్ వంటి సహజ ఫైబర్ దుస్తులు.. ఇలాంటి సమస్యకు ఎక్కువగా గురవుతాయి. అయితే, ఈ సమస్య వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. దుస్తులు ఎందుకు కుంచించుకుపోతాయో అర్థం చేసుకోవడానికి ముందు.. అవి ఎలా తయారయ్యాయి? వాటి ఫైబర్ లక్షణాలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
కాటన్, లెనిన్ వంటి సహజ ఫైబర్లు.. సెల్యులోజ్ అణువులతో ఏర్పడతాయి. తయారీ సమయంలో ఈ ఫైబర్లను కప్పి, మగ్గంపై నేసి.. వస్త్రంగా తయారు చేస్తారు. అయితే, ఈ ఫైబర్లు తేమను తీసుకున్న తర్వాత.. తమ ప్రారంభ స్థితికి తిరిగి వచ్చే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అందుకే.. వాటిని ఉతికినప్పుడు నీటి తేమ తగిలి కుంచించుకుపోతాయి. సాధారణంగా కాటన్ దుస్తులు సుమారు 3 నుంచి 5 శాతం వరకూ కుంచించుకుపోతాయట. అంటే, ఒక మీటర్ పొడవు ఉన్న వస్త్రం.. ఉతికిన తర్వాత దాదాపు 3 నుంచి 5 సెంటీమీటర్లు తగ్గుతుంది. ఇది ఫైబర్ల సహజ లక్షణమని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని సలహా ఇస్తున్నారు.