గోధూళి వేళలో గువ్వలన్నీ గూళ్లకు చేరుకుంటాయి. తల్లి పక్షులు తెచ్చిన గింజలు తిని.. సంధ్యారాగపు సరిగమలు వింటూ నిద్రలోకి జారుకుంటాయి. వే‘కువకువలు’ మొదలయ్యాకే పిల్ల పక్షులు బద్ధకంగా రెక్కలు ఆడించే ప్రయత్నం చేస్తాయి. అవి వాటి టైమింగు! మునిమాపు వేళ ముంచుకొచ్చే నిద్ర బుల్లిపిట్టలకే కాదు ముద్దులొలికే బుజ్జాయిలకూ వరమే. లాలిపాట లేకున్నా.. ఆ సమయంలో ఇంత లాలపోస్తే చాలు.. నిద్రలోకి జారుకుంటారు. గాఢంగా నిద్రపోయే చిన్నారుల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని పలు అధ్యయనాలు జోలపాడి మరీ చెబుతున్నాయి. పసిపిల్లలు రోజుకు 12 నుంచి 16 గంటలు నిద్రించాలని నిపుణుల సూచన. ఏడాది నుంచి రెండేండ్లలోపు పిల్లలు 8 నుంచి 12 గంటలు నిద్రపోవాలట. పసివయసులో సరైన నిద్ర లేకపోతే.. వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. అందుకే, పిల్లలకు నాణ్యమైన నిద్ర అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే!
చాలామంది తల్లిదండ్రులు పసిపిల్లల నిద్ర విషయంలో సరిగ్గా అంచనా వేయరు. వాళ్లకు పని ఉన్నరోజు.. బుజ్జాయిని భుజాన వేసుకొని తెగ ఊపుతూ, నిద్ర పుచ్చుతారు. ఇంకోరోజు.. కునికిపాట్లు పడుతున్న చిన్నారిని బలవంతాన మేల్కొల్పుతూ ఉంటారు. ఈ రెండు వైఖరులూ తప్పే! కడుపు నిండా తిండి ఉంటే.. కంటి నిండా నిద్రపోవడానికి వాళ్లు సదా సిద్ధంగా ఉంటారు. మీ పిల్లల రెగ్యులర్ నిద్రవేళలను గమనిస్తూ.. అందుకు తగ్గట్టుగా వాళ్లను పడుకోబెట్టాలి. పనులుంటే తర్వాత చక్కబెట్టుకోవచ్చు. మీ తొందర కోసం వారి నిద్రను చిందరవందర చేయొద్దని గుర్తుంచుకోండి.
కొందరు పిల్లలు చీమ చిటుక్కుమన్నా చటుక్కున లేచిపోతారు. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం అవసరం. ముఖ్యంగా ఈగలు, దోమల బెడద లేకుండా చూసుకోవాలి. మెత్తటి పక్క పరచాలి. కాలానికి తగ్గట్టుగా దుస్తులు వేయాలి. మృదువైన దుప్పటి చెవులను మూస్తూ కప్పి నిద్రపుచ్చాలి. అతి వెలుతురు, అనవసరమైన శబ్దాలూ లేకుండా జాగ్రత్తపడాలి.
ఏడాదిన్నర, రెండేండ్లు దాటిన చిన్నారుల నిద్ర సమయం సహజంగానే తగ్గుతుంది. మధ్యాహ్నం పూట ఓ రెండు గంటలు పడుకుంటే.. అర్ధరాత్రి దాటేదాకా నిద్రాదేవికి తలొగ్గరు. ఇలాంటి చిచ్చర పిడుగులను కథలతో కట్టిపడేయాలి. చిట్టిపొట్టి కథలు చెబుతుంటే.. ఊఁ కొడుతూ బజ్జుండిపోతారు. పగటి పూట, సాయంత్రాలు పిల్లలను ఆడిస్తే.. రాత్రి త్వరగా పడుకుంటారు. కొందరు పిల్లలకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఉంటుంది. పక్క తడిపిన తర్వాత నిద్రాభంగం అవుతుంది. అలాకాకుండా ఉండాలంటే పడుకునే ముందు వాష్‌రూమ్‌కు వెళ్లొచ్చే అలవాటు చేయడం మంచిది.