ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్‌కిడ్స్ హవా నడుస్తున్నది. అగ్రతారల వారసుల అరంగేట్రం జోరుగా సాగుతున్నది. అందులోనూ తల్లుల వారసత్వాన్ని కొనసాగిస్తూ.. టాప్ హీరోయిన్ల కూతుళ్లు బీటౌన్‌లో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషీతోపాటు రవీనా టాండన్ తనయ రాశా తడానీ బాలీవుడ్లో అడుగుపెట్టి.. రఫ్పాడిస్తున్నారు. ఈక్రమంలో కాజోల్, అజయ్ దేవ్‌గణ్ దంపతుల కుమార్తె నైసా దేవ్‌గణ్‌పై బీటౌన్ మీడియా ఫోకస్ పెట్టింది.
ఆమె బాలీవుడ్ అరంగేట్రం ఎప్పుడా? అని ఎదురుచూస్తున్నది. తాజాగా, కాజోల్ రాబోయే చిత్రం ‘మా’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా.. నైసా బాలీవుడ్ ఎంట్రీపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన అజయ్‌ను మీడియా ప్రతినిధులు ఇదే విషయంపై ప్రశ్నించగా.. ఆయన ఒక్కమాటతోనే నైసా కెరీర్‌పై స్పష్టతనిచ్చాడు. ‘ప్రస్తుతమైతే నైసాకు ఇండస్ట్రీలోకి రావడానికి ఆసక్తిలేదు!’ అంటూ.. చర్చకు ఫుల్స్టాప్ పెట్టేశాడు.
ఇక ‘మా’ సినిమా విషయానికి వస్తే.. తన కూతురిని దెయ్యం చెరనుంచి విడిపించుకునేందుకు ఓ తల్లి చేసే పోరాటమే ఈ చిత్రం. విజువల్ ఫీస్ట్‌గా రాబోతున్న ఈ హారర్ చిత్రంలో కాజోల్ ప్రధానపాత్ర పోషిస్తున్నది. జియో స్టూడియోస్‌తో కలిసి అజయ్ దేవ్‌గణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. విశాల్ పూరియా దర్శకత్వం వహించాడు. రోనిత్ రాయ్, సుభద్ర సేన్ గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ కీలక పాత్రల్లో నటించారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.