ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే.. ఫోన్‌తో పాటు పవర్ బ్యాంకును కూడా బ్యాగులో పెట్టేస్తాం. అయితే, విమానయానం చేసేటప్పుడు అలా కుదరకపోవచ్చు. ఎందుకంటే, విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకుల వాడకంపై ఆంక్షలు పెరుగుతున్నాయి. విమానం ఆకాశంలో తేలిపోతున్నప్పుడు తక్కువ వెలుతురు, అధిక పీడనం, పొడిగాలి వీటన్నిటి వల్ల బ్యాటరీల్లో లోపాలు తలెత్తుతున్నాయట! అందుకే, లిథియం-అయాన్ బ్యాటరీల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించిన అంతర్జాతీయ విమాన రవాణా సంఘం పలు మార్గదర్శకాలను తీసుకొచ్చింది.
ఇటీవలి కాలంలో పవర్ బ్యాంక్ వల్ల విమానంలో మంటలు చెలరేగిన ఘటనలు వెలుగు చూశాయి. కొన్ని ఘటనల్లో క్యాబిన్ పొగతో నిండిపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో విమానాల్లో పవర్ బ్యాంకులపై నిబంధనలు కఠినతరం చేస్తున్నారు అధికారులు. క్వాంటాస్ ఎయిర్వేస్ పవర్ బ్యాంక్‌లను క్యాబిన్ బ్యాగేజీలో ఉంచాలనీ, ప్రయాణంలో వాటిని వాడకూడదని షరతులు విధించింది.
ఎమిరేట్స్ సంస్థ పవర్ బ్యాంకులను అనుమతిచ్చినా.. ప్రయాణంలో వాటిని చార్జింగ్ చేయకూడదనీ, ఉపయోగించకూడదని ఆంక్షలు విధించింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ సైతం తమ విమానాల్లో నిర్దేశించిన పరిమితిలో పవర్ బ్యాంకులను అనుమతిస్తున్నది. అయితే ప్రయాణంలో ఫోన్ చార్జింగ్ చేయకూడదని పేర్కొన్నది.
నిర్దేశించిన సామర్థ్యం కన్నా ఎక్కువ పవర్ ఉన్నవాటిని తీసుకెళ్లడానికి అధికారుల అనుమతి తప్పనిసరి. వంద వాట్లలోపు పవర్ బ్యాంకులను హ్యాండ్ బ్యాగులో అనుమతిస్తారు. 100-160 వాట్ల పవర్ బ్యాంకులు తీసుకెళ్లాలంటే ఎయిర్‌లైన్స్ అనుమతి తప్పనిసరి. 160 వాట్ల కన్నా ఎక్కువగా ఉంటే.. అనుమతివ్వరు.