కాలానుగుణంగా మనిషి ఆసక్తులు మారుతూ ఉంటాయి. ట్రావెలర్స్ పోకడలు కూడా మారుతున్నాయి. ట్రావెల్ అంటే ఒకప్పుడు అనుకున్న చోటుకు ఇలా వెళ్లి, అలా రావడమే ఉండేది! ఇప్పుడు అందుకు భిన్నంగా వెళ్లిన చోట కొన్నాళ్లు ఉండటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓ ట్రావెల్ ఏజెన్సీ తాజా అధ్యయనం ప్రకారం.. చాలామంది పర్యాటకులు సుదూర తీరాలకు, సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట.
ఈ ట్రెండ్‌కు గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పాతిక శాతం ఆదరణ పెరిగిందని సర్వేకారుల అంచనా. అంతేకాదు, ట్రావెలర్స్ తాము వెళ్లిన ప్రదేశాన్ని చూసి మురిసిపోవడంతోనే సరిపెట్టుకోవడం లేదు. ఆ ప్రదేశం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి తగిన సమయం వెచ్చిస్తున్నారట.
పైపై మెరుగులు చూడటానికే పరిమితం కాకుండా.. అక్కడి ప్రజల జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలు కూడా తెలుసుకునేందుకు ముచ్చటపడుతున్నారట. ఈ మేరకు ఆయా పర్యాటక కేంద్రాల్లో నాలుగైదు రోజులు ఉండటానికి ప్రాధాన్యం ఇస్తున్నారని సదరు అధ్యయనంలో తేలింది. విహారం అనేది ఆటవిడుపు కాదని, అంతకుమించి అని ఈ నయా ట్రెండ్ నిరూపిస్తున్నది.