కళ (ఆర్ట్).. ఇంటికి సరికొత్త కళను తీసుకొస్తుంది. ఆర్ట్‌వర్క్ లేని గృహం.. అసంపూర్ణంగా కనిపిస్తుంది. అందుకే, ఇంట్లో ఏదో ఒక కళాఖండం ఉండాలని చెబుతున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. అయితే, ఇలాంటి కళాకృతులు చాలావరకు ఖరీదైనవే ఉంటాయి. వాటి కొనుగోలు, నిర్వహణ ఖర్చుతో కూడుకొన్న పని. అలాంటప్పుడు.. స్థానిక కళాకృతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
దీనివల్ల తక్కువ ఖర్చుతోనే ఇంటిని అందంగా మార్చుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా.. స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించిన వాళ్లమవుతామనీ పేర్కొంటున్నారు. చేర్యాల పెయింటింగ్‌కు ఫ్రేమ్ కట్టించి, ఇంటి హాల్లో వేలాడదీస్తే.. అద్భుతంగా కనిపిస్తుంది.
కరీంనగర్ ఫిలిగ్రీ కళాకృతులు, నిర్మల్ కొయ్యబొమ్మలు, బంజారా నీడిల్ క్రాఫ్ట్స్, ఢోక్రా లోహపు కళాకృతులు.. షెల్ఫ్‌లో అలంకరిస్తే చూడముచ్చటగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీమీ ప్రాంతాల్లో జరిగే ఎగ్జిబిషన్లు సందర్శించండి. స్థానిక కళాకృతులను కొనుగోలు చేసి.. ఇంటిని అందంగా అలంకరించుకోండి.