Sabitri Majhi | ఒడిశాలోని నువాపడా జిల్లాలోని మారుమూల పల్లె సింఝర్. ఆటలకు ఈ ఊరు ఆటపట్టు. ఎనిమిదేండ్లు వచ్చాయో లేదో.. బ్యాట్ అందుకొని పొలోమని క్రికెట్ జట్టులో దూరిపోతారు. అయితే క్రికెట్.. లేదంటే కబడ్డీ! ఊరంతా ఇదే వింత!! అయితే, ఆటలపై ఇంత మనసున్నా.. వారికి సరైన మైదానం లేదు. పొలాల్లో, రోడ్ల మీద ఆడుతూ ఆటవిడుపు పొందుతుంటారు. తమకంటూ ఓ మైదానం కావాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా.. పట్టించుకోలేదు! సింఝర్ గ్రామానికి చెందిన 95 ఏండ్ల సావిత్రి వారి ఆశలను నెరవేర్చింది.
తనకున్న ఐదెకరాల భూమిని క్రీడాస్థలం కోసం దానం చేసింది. ఆటలపై ఆమెకున్న ఇష్టం అలాంటిది. అలా ఎలా ఇచ్చేశారు బామ్మా అని అధికారులు అడిగితే.. ‘పెండ్లి తర్వాత నేను ఈ గ్రామంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆటలపై ఇక్కడి వారికున్న ప్రేమను చూస్తున్నాను. ఇది తరాలుగా కొనసాగుతున్నది.
ఈ వారసత్వాన్ని కాపాడాలని భూమి ఇచ్చాను. అంతేకాదు.. ఆరోగ్యానికి ఆటలే చక్కని సాధనం!! నేను ఇచ్చిన భూమిలో పిల్లలు ఆడుతూ.. పాడుతూ.. ఉంటే చూడాలని ఉంది. ఆడుతూ గెలవడం చూస్తే నాకు సంతోషం!!’ అని చెప్పుకొచ్చింది. ఆమె భర్త నీలాంబర్ మార్జీ గతంలో గ్రామంలో పాఠశాల, ఉన్నత పాఠశాల, ఆలయం కోసం భూమి ఇచ్చారు. ఆయన చనిపోయి పదేండ్లయింది.
ఆయన స్ఫూర్తితో ఐదెకరాలూ గ్రామానికి ధారాదత్తం చేసింది సావిత్రి. ఇటీవల నువాపడా కలెక్టర్ మధుసూదన్ దాస్ ఆమె ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పారు. ‘ఈ భూమిలో మినీ స్టేడియం కట్టిస్తామ’ని హామీ ఇచ్చారు. మొత్తానికి సింఝర్ క్రీడాస్ఫూర్తి మరో పదితరాలు కొనసాగేలా ఊపిరి పోసిన సావిత్రికి సాహో చెప్పాల్సిందే!