వెండితెరపై తళుకులీనాలని కొందరు నటీమణులు కడుపు కట్టుకొని మరీ.. జీరో సైజ్ మెయింటెయిన్ చేస్తుంటారు. మరికొందరు కాస్మెటిక్ సర్జరీలతో తమ రూపాన్ని మెరుగుపరుచుకుంటారు. అయితే, ఎవ్వరూ కూడా ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోరు. కానీ, బాలీవుడ్ నటి ఖుషీ కపూర్ మాత్రం.. తాను కాస్మెటిక్ సర్జరీలు చేయించుకున్నట్లు మీడియా సమక్షంలోనే చెప్పేసింది. పెదవులు, కనుబొమలతోపాటు ముక్కుకూ చిన్నపాటి శస్త్రచికిత్సలు చేయించుకున్నట్లు తెలిపింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను నా లుక్స్‌ని మార్చుకున్నాను. కానీ, అందరూ అనుకుంటున్నట్లు 10 సర్జరీలు చేయించుకోలేదు. చిన్నచిన్న సర్దుబాట్లు మాత్రమే చేసుకున్నాను’ అంటూ చెప్పింది. ఇక ఇండస్ట్రీలో రాణించాలంటే లుక్స్ బాగుండాలనీ, అందుకోసం సర్జరీలకు వెళ్లడం పెద్ద తప్పేం కాదనీ అంటున్నది. ‘చిత్ర పరిశ్రమలో రాణించాలంటే.. గ్లామర్‌గా ఉండాలి. అందుకోసం ఏదో ఒకటి చేయాలి. లేకుంటే మనలోని చిన్నచిన్న లోపాలే.. పెద్దపెద్ద సమస్యలుగా మారుతాయి. మన కెరీర్‌కు ఆటంకాలుగా పరిణమిస్తాయి. అందుకే, చిన్నచిన్న సర్జరీలతో నాలోని లోపాల్ని సవరించుకున్నా!’ అంటూ తెలిపింది.