శుక్రవారం 30 అక్టోబర్ 2020
Yadadri - Sep 23, 2020 , 01:06:51

అభివృద్ది ప్రదాత సీఎం కేసీఆర్‌

అభివృద్ది ప్రదాత సీఎం కేసీఆర్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలి

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

వలిగొండ: అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్‌ అని, అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసే సత్తా సీఎం కేసీఆర్‌కే ఉందని అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్‌ ఫంక్షన్‌హాల్‌లో మండల టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రం, గోదావరి నదిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, ఆసరా పింఛన్‌, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, నూతన రెవెన్యూ చట్టం సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, భువనగిరి నియోజకవర్గానికి సీఎం కృషితో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు చెరువుల్లోకి చేరుతున్నాయని, ప్రతి చెరువు నిండుకుండను తలపిస్తూ రైతులకు నయనానందకరంగా సాక్షాత్కరిస్తున్నాయన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. ప్రతి ఓటు అమూల్యమైందని, ఓటరు నమోదు కార్యక్రమంలో పట్టభద్రులకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపునకు చేపట్టాల్సిన వ్యూహాలపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు డేగల పాండరి, పీఏసీఎస్‌ చైర్మన్లు సుర్కంటి వెంకట్‌రెడ్డి, చిట్టెడి వెంకట్‌రాంరెడ్డి, మండల రైతుబంధు కన్వీనర్‌ పనుమటి మమతానరేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ కవిత, మదర్‌డైరీ డైరెక్టర్‌ గూడూరు శ్రీధర్‌రెడ్డి, వలిగొండ పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అయిటిపాముల రవీంద్ర, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శాంతికుమార్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి పైళ్ల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.