మంగళవారం 02 జూన్ 2020
Yadadri - Jan 15, 2020 , 01:34:37

టోల్‌ప్లాజా బారికేడ్‌ను ఢీకొన్న బైక్‌

టోల్‌ప్లాజా బారికేడ్‌ను ఢీకొన్న బైక్‌బీబీనగర్‌: సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఎన్నో ఆశలతో ద్విచక్రవాహనంపై తన సొంత ఊరికి బయల్దేరిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి బీబీనగర్‌ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని నూనెగూడెం గ్రామానికి చెందిన గన్నె స్వామిరెడ్డి (23), కరుణాకర్‌రెడ్డి ఇద్దరూ ఉప్పల్‌లోని భరత్‌నగర్‌లో అద్దెకు ఉంటూ.. ఓ ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజులాగే తమ విధులను ముగించుకుని సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఉప్పల్‌ నుంచి పల్సర్‌ ద్విచక్రవాహనంపై స్వామిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి కలిసి బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో బీబీనగర్‌ మండలంలోని టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ క్యూలైన్‌ కోసం రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన బారికేడ్‌కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న స్వామిరెడ్డి తలకు, కన్నుకు బారికేడ్‌ బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న కృష్ణారెడ్డికి కూడా తీవ్రగాయాలయ్యాయి. గమనించిన టోల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందజేయడంతో ఎస్సై సుధాకర్‌గౌడ్‌ సంఘటన స్థలానికి చేరుకుని వారిని 108లో భువనగిరిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రధాన జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా యాజమాన్యం ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. తమ ఇష్టానుసారంగా బలమైన ఇనుప రాడ్లతో కూడిన బారికేడ్లను ఏర్పాటు చేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్వామిరెడ్డి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడి మృతికి కారణమైన టోల్‌ప్లాజా యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీబీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో మృతుడి తల్లి గన్నె లక్ష్మి మంగళవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సుధాకర్‌గౌడ్‌ తెలిపారు.


logo