కాశీబుగ్గ, నవంబర్ 22: ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీ మహానటులు, దొంగలను నమ్మి మోసపోవద్దని, ఎల్లవేళలా మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నన్నపునేని నరేందర్ కోరారు. బుధవారం ఆయన 19వ డివిజన్లో కార్పొరేటర్ ఓని స్వర్ణలతా భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళహారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే, తెలంగాణ ఉద్యమ నాయకుడు, డివిజన్ యూత్ అధ్యక్షుడు సిలువేరు పవన్‌కుమార్ క్రేన్ సహాయంతో నన్నపునేనికి గజమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని చాలామంది నాయకులు పరిపాలించారని, రాజకీయ పదవులు కూడా పొందారని, కానీ కాశీబుగ్గను ఎవరూ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఎక్కడో వంచనగిరి, పర్వతగిరి నుంచి వచ్చిన వాళ్లకు మన గోసలు ఎలా తెలుస్తాయో ప్రజలు ఆలోచించాలని కోరారు. వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్లో 2500 ఉద్యోగాల్లో 19వ డివిజన్ ప్రజలకు ప్రాధాన్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ ప్రాంత ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఓ నాయకుడు పార్టీ మారి కార్యకర్తలు, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ సంక్షేమ పరిపాలన కావాలో.. గూండాలు, రౌడీల రాజ్యం కావావో ప్రజలే ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తనపై కబ్జాల ఆరోపణ చేస్తున్నారని, నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి వచ్చానని, ప్రజలకు సేవ చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఆశీర్వదిస్తే తూర్పును దేశానికే రోల్‌మోడల్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, బొట్ల సదానందం, ఆర్టీఏ సభ్యుడు గోరంటల మనోహర్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఈటెల ఉమేందర్, నాయకులు రాజనాల శ్రీహరి, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, వేముల నాగరాజు, గనిపాక సుధాకర్, పద్మా గంగాధర్, క్యాతం రంజిత్, చిలువేరు పవన్, కంచ సంపత్ పాల్గొన్నారు. అనంతరం మంతెన అంబరీష్ కుటుంబ సభ్యులను నన్నపునేని బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
పోచమ్మమైదాన్: కార్యకర్తలందరూ సమష్టిగా పని చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ పిలుపునిచ్చారు. వరంగల్ మండలంలోని ఓట్ల ఇన్చార్జీల బాధ్యులతో దేశాయిపేటరోడ్డులోని కేఆర్గార్డెన్లో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఇతర అంశాలపై బాధ్యులతో కూలంకషంగా చర్చించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రకాశ్ మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ కృషి వల్ల పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలందరూ మొక్కవోని దీక్షతో సైనికుల్లా పని చేస్తూ, పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుడు, ఇన్చార్జి బాధ్యులు పాల్గొన్నారు. అలాగే, 33వ డివిజన్ రాజశ్రీ గార్డెన్లో ఖిలావరంగల్ మండలం 100 ఓట్ల ఇన్చార్జి బాధ్యులతో ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్ సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేస్తూ ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరాలన్నారు. ఖిలా వరంగల్ మండల పరిధిలోని కార్పొరేటర్లు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, ఇన్చార్జి బాధ్యులు పాల్గొన్నారు.
గిర్మాజీపేట: మీ ఆశీర్వాదమే తనకు వెయ్యి ఏనుగుల బలమని, వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి గెలిపిస్తే అండగా ఉంటానని ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం రాత్రి ఆయన 28వ డివిజన్లో కార్పొరేటర్ గందె కల్పన-నవీన్ దంపతుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోనాలు, బతుకమ్మలు, డప్పుచప్పుళ్లు, అభిమానుల కోలాహలం మధ్య ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రూ. 158 కోట్లతో సంతోషిమాతకాలనీ ముంపునకు గురికాకుండా అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణం చేపట్టామన్నారు. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిట్టి రాములు, ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్ తుమికి రమేశ్‌బాబు, శ్రీనాథ్, నర్సింహారెడ్డి, శంకర్‌సింగ్, కిరణ్, బైరి అఖిల్, ప్రభాకర్, రాంబాబు, శ్రీహరి, మధు, రత్నాకర్, సురేశ్, కల్యాణ్, శ్రవణ్, స్వామి, పాండు, రాజేశ్, పెద్దపల్లి కృష్ణ, బంటి, అఖిల్, సదానందం, విక్కీ, వెంకటేశ్, నాగరాజు, సన్ని, కనకాచారి, సరోజనమ్మ, లక్ష్మమ్మ, శిల్పా, లావణ్య పాల్గొన్నారు.