కరీమాబాద్, ఆగస్టు 2: వచ్చే ఆల్ ఇండియా డ్యూటీమీట్‌లో రాష్ట్ర పోలీసులు సత్తాచాటి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందాలని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామునూరులోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో 2వ రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీమీట్ -2025 ముగింపు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీజీపీ డాక్టర్ జితేందర్, జైళ్ల విభాగం డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రాలు హాజరై పీటీసీ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు.
ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ డ్యూటీమీట్ విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో భాగంగా ఇలాంటి డ్యూటీ మీట్లు పోలీసులకు అవసరమన్నారు. గతంలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో 18 మెడల్స్‌ను గెలుపొందారని, ఈసారి ఎక్కువ మెడల్స్ గెలుపొందాలన్నారు. ఇందుకోసం అధికారులు, సిబ్బంది విజయాలపై ఫోకస్ పెట్టాలన్నారు. నిరంతర సాధనతోనే ఏదైనా సాధ్యమన్నారు.
విధి నిర్వహణలోనూ నిబద్ధతతో పనిచేయాలన్నారు. మారుతున్న కాలానుగుణంగా విధులు చేపట్టాలన్నారు. వృత్తిలో నైపుణ్యం సాధించి నప్పుడే ప్రజలకు న్యాయం అందించగలుగుతామన్నారు. జైళ్ల విభాగం డీజీపీ డాక్టర్ సౌమ్యమిశ్రా మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్-2025కు రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో తాను వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్ గుర్తుకు వస్తుందన్నారు.
త్వరలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో సైతం డ్యూటీమీట్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాలను సొంతం చేసుకున్న జట్లకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ ప్రతిభతో ఎక్కువ పతకాలను గెలుపొందిన ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిన సైబరాబాద్ టీమ్‌ను అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్ర మంలో మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, కలెక్టర్లు సత్యశారదాదేవి, స్నేహా శబరీష్, ఎస్పీలు కిరణ్ఖర్గే, సుధీర్కేకన్, పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, కమాండెంట్ రామ్‌ప్రకాశ్, వరంగల్ కమిషరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.