వరంగల్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ తరహాలోనే గ్రేటర్ వరంగల్లోనూ ఉమెన్ హబ్(వీ-హబ్) ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అనుకుంటు న్న మహిళలకు అండగా ఉండేందుకు ఈ పని చేస్తోంది. హైదరాబాద్ తర్వాత ఎక్కువ మంది మహిళలు ఉండే వరంగల్ మహానగరంలోనూ దీన్ని ఏర్పాటు చేస్తోంది. మహిళా పారిశ్రామికవేత్తలకు, వారి ఆధ్వర్యంలో చేసిన ఉత్పత్తులకు జాతీయ స్థాయి లో మార్కెటింగ్ సపోర్ట్ అందించేలా వీ-హబ్ పని చేయనుంది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికీ తొలి అడుగు నుంచి సంపూర్ణ సహకారం అందించనుంది. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలతో 2018లో ప్రారంభమైన వీ-హబ్ సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్యకలాపాలను మొదలుపెట్టింది. పరిశ్రమ లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేలా మహిళల్లో ఆత్మైస్థెర్యం పెంచేలా పని చేస్తోంది. మహిళల ఆధ్వర్యంలో 108 పరిశ్రమలు ఏర్పాటు చేయించడంలో వీ-హ బ్ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం వరంగలో సెంటర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తోంది. జర్మనీ కాన్సులేట్ జనరల్ క్యారీ స్టోన్‌ను వీ-హబ్ నాలుగు రోజుల కిత్రం నగరానికి తీసుకొచ్చి ఇక్కడి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసింది. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకుంటున్న వారికి మనోధైర్యం నింపేలా ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్న ఉత్పత్తులకు జర్మనీ ప్రభుత్వం నుంచి మార్కెటింగ్ సహకారం అందిస్తామని క్యారీ స్టోన్‌తో హమీ ఇప్పించడంలో వీ-హబ్ విజయవంతమైంది. వీ-హబ్ సీఈవో దీప్తి రావుల, వైస్ ప్రెసిడెంట్ శకుంతల, స్పాన్సర్షిప్ మేనేజర్ రమ్య గురువారం గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్యతో సమావేశమయ్యారు. వరంగల్‌లో వీ-హబ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని కోరాగా, కమిషనర్ సానుకూలంగా స్పందించారు.
మార్కెటింగ్ సపోర్టు..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్లూఎంసీ) పరిధిలో 15,502 మహి ళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 1.63 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల్లోని మహిళలు పరిశ్రమలు ఏర్పాటు చేసే విషయంలో వినూత్న ఆలోచనలు ఉన్నా వారికి అవగాహన కల్పించే వ్యవస్థలు లేకపోవడంతో విజయవం తం కాలేకపోతున్నారు. గ్రేటర్ వరంగల్‌లో వీ-హబ్ సెంటర్ ఏర్పాటుతో ఇలాంటి మహిళలకు భరోసా కలుగనుంది. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న వరంగల్ మహానగరంలో పారిశ్రామికంగా ఎదగాలనే ఆలోచనలతో ఉన్న యువ మహిళలకు వీ-హబ్ ఎంతో దోహదపడనుంది. మహిళలు జీడబ్లూఎంసీ సహకారంతో పరిశ్రమలు ఏర్పాటు చేసి రాణిస్తున్నారు. పూలతో అగర్బత్తులు, శానిటరీ న్యాప్కిన్స్, చేనేత ఉత్పత్తులు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల మార్కెటింగ్‌కు తగ్గట్లుగా పోటీ ఇవ్వలేకపోతున్నారు. మ హిళలు ఏర్పాటు చేసిన పరిశ్రమల ఉత్పత్తులకు వీ-హబ్ మార్కెటింగ్ సపోర్ట్ కల్పించనుంది. పరిశ్రమల పురోగతికి సాంకేతిక సహకారం అందించనుంది. పరిశ్రమల్లో పని చేసే మహిళల్లో నైపుణ్యాన్ని పెంపొందించేలా వీ-హబ్ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే మహిళలకు బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పించేందుకు వీ-హబ్ సహకరించనుంది. మహిళలో ఉన్న వినూత్న ఆలోచనలకు పదును పెట్టి వారిని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించి సక్సెస్ అయ్యేలా వీ-హబ్ తోడ్పాటును అందించనుంది.