వరంగల్, మార్చి 2: హోం కంపోస్ట్ తయారీని ప్రోత్సహించి స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో జీడబ్ల్యూఎంసీ ఉత్తమ ర్యాంక్ సాధించేలా కృషి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఆమె మెప్మా అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా హోం కంపోస్ట్‌ను ప్రోత్సహించేలా పలు సూచనలు చేశారు. నగరంలోని ప్రతి స్వయం సహాయక బృందం కనీసం మూడు హోం కంపోస్ట్లు తయారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మిగితా వారిలో స్ఫూర్తి నింపేలా మహిళా సంఘాలు తయారు చేసిన హోం కంపోస్ట్‌లను సామాజిక మధ్యామాల్లో పోస్ట్ చేయాలని సూచించారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన కంపోస్ట్‌ను బల్దియా కిలో రూ. 20 చొప్పున కొలుగోలు చేస్తుందన్నారు. సమర్థవంతంగా ఎరువు తయారు చేసిన వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో హోం కంపోస్ట్ ఒక అంశంగా ఉందని గుర్తుచేశారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో నగరవాసులు ధనాత్మక ధోరణిలో సమాచారం ఇవ్వడం వల్ల నగరానికి ఎక్కువ మార్కులు దక్కి ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు దోహదపడుతుందని తెలిపారు. కమ్యూనిటీ ఆర్గనైజర్లు వెంటనే టీఎల్ఎఫ్లతో సమావేశాలు ఏర్పాటు చేసి హోం కంపోస్ట్ ఎరువు తయారీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి, మెప్మా అధికారులు రజితారాణి, వెంకటరెడ్డి, రమేశ్, సీవోలు తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై నివేదిక ఇవ్వాలి
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై త్వరగా నివేదిక అందించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులకు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ సంస్థ సౌత్ ఆసియా అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు నగరంలో నిర్వహించిన బేస్‌లైన్ సర్వే వివరాలను మేయర్‌కు వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్‌పై చేసిన అధ్యయన వివరాలను వారు సుధారాణికి వివరించారు. గ్రేటర్ పరిధిలో ఉత్పతి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, డీఆర్సీసీ సెంటర్ల బలోపేతం, డీఆర్సీసీ సెంటర్లకు రాక్ పిక్కర్ల అనుసంధానం, స్వచ్ఛ ఆటోల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ తదితర అంశాలపై చర్చించారు. ఐసీఎల్ఈఐ సౌత్ ఆసియా నగరాల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు వరంగల్ నగరాన్ని ఎంపిక చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన డీపీఆర్‌ను త్వరగా అందజేయాలని సుధారాణి కోరారు. సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమనికుమార్, డీడీ సౌమ్య చతుర్వేది, అసిస్టెంట్ మేనేజర్ సంస్కృత, బల్దియా చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు సాంబయ్య, భాస్కర్ పాల్గొన్నారు.