రైతులకు వెన్నుదన్నుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద టీఆర్ఎస్ సర్కారు శుక్రవారం చేపట్టిన మహాధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అన్నదాతలకు మద్దతుగా స్వచ్ఛందంగా వాహనాల్లో బయలుదేరి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కదం తొక్కారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, నాయకులు గళమెత్తి వడ్లను కొనేదాకా విశ్రమించేది లేదని స్పష్టం చేశా రు. తెలంగాణ రైతులపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు.
వరంగల్, నవంబర్ 18(నమస్తేతెలంగాణ) : రైతన్న కోసం గులాబీ దండు కదంతొక్కింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద గురువారం టీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నాకు జిల్లా నుంచి తరలివెళ్లింది. కేంద్రం యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేసింది. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు చలో ఇందిరాపార్క్ అంటూ ఉదయమే హైదరాబాద్ బయల్దేరారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర మంత్రులతో కలిసి మహాధర్నాలో పాల్గొన్నారు. యాసంగి వడ్లు కొనబోమన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతులపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. పంజాబ్ రాష్ట్రంలో వడ్లు కొంటున్న కేంద్రం తెలంగాణలో కొనబోమని ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో వడ్లు కొంటామని కేంద్రం చెప్పే వరకు పోరాడుతామని, ఇది ఆరంభమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష కనబరుస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో కూడిన ప్లకార్డులు చేబూని టీఆర్ఎస్ ముఖ్యనేతలు మహాధర్నాలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ తొలిసారి పాల్గొన్న ధర్నా కార్యక్రమం గులాబీ దండుకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కేంద్రం దిగొచ్చి తెలంగాణలో యాసంగి వడ్లను కొనేవరకు వెనిక్కి తగ్గేది లేదని, రైతుల కోసం పోరాడుతామని టీఆర్ఎస్ ముఖ్యనేతలు స్పష్టం చేశారు.
మండలాల నుంచి ముఖ్యనేతలు..
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నాకు జిల్లా నుంచి పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఉదయమే ఇక్కడి నుంచి వాహనాల్లో హైదరాబాద్ పయనమయ్యారు. కేంద్రం యాసంగి వడ్లు కొనాలనే డిమాండ్‌తో కూడిన ఫ్లెక్సీలను తమ వాహనాలకు కట్టారు. హైదరబాద్ బయల్దేరిన సమయంలో గ్రామాలు, మండల, నియోజకవర్గ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్నాక రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నర్సంపేట, వరంగల్‌తూర్పు, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డితో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేల పిలుపు మేరకు టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఉత్సాహంగా మహాధర్నాకు చేరుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి రాయపర్తి మండలం నుంచి ఎంపీపీ అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరసింహనాయక్, ముఖ్యనేతలు బిల్ల సుధీర్‌రెడ్డి, సురేందర్రావుతో పాటు సర్పంచ్‌లు, పార్టీ శ్రేణులు ధర్నాకు హాజరయ్యారు. చెన్నారావుపేట మండలం నుంచి ఎంపీపీ బదావత్ విజేందర్, రైతుబంధ సమితి మండల కన్వీనర్ బుర్రి తిరుపతి తదితరులు, నర్సంపేట మండలం నుంచి ఎంపీపీ ఎం కళావతి, జడ్పీటీసీ కొమాండ్ల జయ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణ, నల్లబెల్లి మండలం నుంచి పార్టీ మండలాధ్యక్షుడు బానోత్ సారంగపాణి, పార్టీ నేత ఊడుగుల ప్రవీణ్‌గౌడ్ తదితరులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి మహాధర్నాలో పాల్గొన్నారు. వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యే అరూరి రమేశ్ వెంట ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్‌తో పాటు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీ కుమారస్వామి ధర్నాకు హాజరయ్యారు.
వరంగల్ నగరం నుంచి..
వరంగల్ జిల్లా కేంద్రం నుంచి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ముఖ్యనేతలు మహాధర్నాలో పాల్గొన్నారు. కార్పొరేటర్లు గుండేటి నరేందర్, కావటి కవిత, ఎండీ ఫుర్ఖాన్, ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, నాగేశ్వరస్వామి దేవస్థానం కమిటీ డైరెక్టర్ బజ్జూరి రవి, పార్టీ నేతలు బస్వరాజ్ శ్రీమాన్, ఎలుగం శ్రీనివాస్, విజయభాస్కర్‌రెడ్డి, డాక్టర్ హరిరమాదేవి, ముష్కమల్ల సుధాకర్, తెలంగాణ జాగృతి నేత మడిపల్లి సుశీల్గౌడ్తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ధర్నాకు హాజరయ్యారు. పరకాల నియోజకవర్గ పరిధిలోని 15, 16, 17 డివిజన్ల కార్పొరేటర్లు మనోహర్, మనీషాశివకుమార్, బాబుతో పాటు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ రవీందర్‌రెడ్డి తదితరులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ధర్నాకు చేరుకున్నారు. మహాధర్నాలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కూడా పాల్గొన్నారు.