63 వైన్ షాపులకు 1,800కు పైగా దరఖాస్తులు
రేపు లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు
వరంగల్, నవంబర్ 18(నమస్తేతెలంగాణ) : మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారం ముగిసింది. జిల్లాలోని 63 వైన్‌షాపులకు 1,800కుపైగా దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ అధికారులు వెల్లడించారు. సెలవు రోజైన 14వ తేదీన మినహా 9 నుంచి 18వ తేదీ వరకు మద్యం దుకాణాలన్నింటికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. హనుమకొండ నిట్ సమీపంలోని ఎక్సైజ్‌శాఖ జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో మూడు కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు.
ఒకేరోజు వెయ్యికిపైగా..
నర్సంపేట, పరకాల, వర్దన్నపేట ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని 63 మద్యం దుకాణాలకు చివరి రోజు వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయి. 2019లో జిల్లాలోని 56 మద్యం దుకాణాలకు 1,768 దరఖాస్తులు వచ్చినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. ఈసారి 63 మద్యం దుకాణాలకు 1,800కుపైగా రావడం విశేషం. సాయంత్రం ఐదు గంటల వరకు కౌంటర్ల లోపలకు దరఖాస్తులతో వచ్చిన వ్యాపారులందరి నుంచి ఎక్సైజ్ అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. రాత్రి 9గం టల సమయంలో అధికారులు స్వీకరించిన దరఖాస్తుల సంఖ్య 1,700 దాటింది. వ్యాపారుల నుంచి ఇం కా తీసుకోవల్సిన దరఖాస్తులు వందకుపైగా ఉన్నట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్లడించారు. మద్యం దుకాణాల కేటాయింపు కోసం ఈ నెల 20న కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన కేటాయిస్తామని ఎక్సైజ్‌శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు చెప్పారు.