వరంగల్, డిసెంబర్ 9(నమస్తేతెలంగాణ) : పేకాటరాయుళ్లకు వసతి సమకూర్చడమే తమ పనిగా పెట్టుకున్నారు కొందరు వ్యక్తులు. క్లబ్బులు మూతపడడంతో మొదట్లో ఇళ్లలో పేకాట శిబిరాలు నిర్వహించారు. ఇందు కోసం ప్రత్యేకంగా పలు ఇండ్లను అద్దెకు తీసుకున్నారు. ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు పేకాట శిబిరాలు నడుస్తున్న ఇళ్లపై దాడులు జరిపి కేసులు నమోదు చేశారు. దీంతో నిర్వాహకులు రూట్ మార్చేశారు. అపార్టుమెంట్లలోని ఫ్లాట్లను అద్దెకు తీసుకున్నారు. కొంతకాలం ఈ ఫ్లాట్లలో దర్జాగా పేకాట నడిచింది. నిర్వాహకుల సూచనల మేరకు పేకాటరాయుళ్లు ఎంచక్కా తమ వాహనాలను అపార్టుమెంట్లో కింద పార్కింగ్ చేసి ఫ్లాట్లలో ఎంజాయ్ చేశారు. రాత్రింబవళ్లూ ఇది కొనసాగడం వల్ల అపార్టుమెంట్ వాసులు పోలీసులను ఆశ్రయించారు. అధికారుల ఆదేశాలతో పోలీసులు దాడులు చేశారు. ఫ్లాట్లలో పేకాట ఆడుతున్న వారితో పాటు నిర్వాహకులను సైతం అరెస్టు చేశారు. నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని ఇళ్లు, ఫ్లాట్లలో పేకాట జరుగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో నిర్వహకులు పేకాట కోసం వరంగల్ నగర శివారులోని పండ్ల తోటలు, ఫామ్‌హౌస్‌లను సెలెక్ట్ చేశారు. వీటిలో పేకాట ప్రారంభమైన కొద్దిరోజులకే పోలీసులు రంగంలోకి దిగారు. దాడులు జరిపి పేకాటరాయుళ్లు, నిర్వాహకులతో పాటు పండ్ల తోటలు, ఫామ్‌హౌస్‌ల యజమానులపైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అయినా పేకాటరాయుళ్లు, నిర్వాహకులు పేకాటను వదులుకోవడం లేదు. పేకాట కోసం నిర్వాహకులు షెల్టర్లను వెతుకుతున్నారు. తమకూ లాభంగా ఉండడంతో ఎలాగైనా వసతి కల్పిస్తున్నారు.
మూడు ఆటో పాయింట్లు..
పోలీసుల దాడులు పెరుగడంతో నిర్వాహకులు మొబైల్ పేకాటను ఎంచుకున్నారు. పేకాటరాయుళ్లకు మొబైల్ మెసేజ్‌లు పంపిస్తూ నగరంలోని వివిధ పాయింట్లలో ఆటోల ద్వారా వారిని నగర శివార్లలోని అడ్డాలకు చేరుస్తూ పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం నగరంలో మూడు ఆటో పాయింట్లను ఏర్పాటు చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట సమయంలో ఈ ఆటోలు మూడు పాయింట్ల వద్దకు చేరుకుంటాయి. ఈ పాయింట్లలో ఒకటి శంభునిపేట. రెండోది గవిచర్లక్రాస్. మూడోది నాయుడు పెట్రోల్‌బంక్. ఆటోలు వచ్చేసరికి పదిహేను మంది పేకాటరాయుళ్లు మూడు పాయింట్ల వద్దకు చేరుకుంటారు. దీనికి కొద్దిసేపటి ముందు నిర్వాహకుల నుంచి తమ మొబైల్‌కు వచ్చే ఎస్ఎంస్ ఆధారంగా పేకాటరాయుళ్లు ఆటోల్లో కూర్చుంటారు. వెంటనే ఆటోల డ్రైవర్లు, పేకాటరాయుళ్లు తమ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేస్తారు. అన్నీ కలిపి ఒక బ్యాగులో పెడుతారు. నిర్వాహకులు చెప్పిన ప్రదేశానికి ఆటో డ్రైవర్లు పేకాటరాయుళ్లను తీసుకెళ్తారు. పేకాట ముగిసిన తర్వాతే అందరూ ఇళ్ల బాట పడుతారు.
రోజుకో ప్రదేశంలో..
నిర్వాహకులు కరీమాబాద్ ప్రాంతం నుంచే ఆపరేట్ చేస్తుంటారు. తమకు టచ్‌లో ఉన్న పేకాటరాయుళ్లను ఇలా ఆటోల ద్వారా రోజుకో ప్రదేశానికి పంపుతున్నారు. వరంగల్‌లోని మిల్స్‌కాలనీ, మామునూరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, గీసుగొండ పోలీసు స్టేషన్ల పరిధిలోని ఓపెన్ ప్లేసుల్లో పేకాట నిర్వహిస్తున్నారు. జన సంచారం లేని ప్రదేశాలను నిర్వాహకులు ముందుగానే గుర్తించి పేకాట కొనసాగిస్తున్నారు. ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో గల జనసంచారం లేని ఓపెన్ ప్లేసులను వాడుకుంటున్నారు. ఎవరికీ ఇబ్బంది కలుగకుండా నడుస్తుండడంతో ఈ వ్యవహారం పోలీసుల వరకు రావడం లేదు. మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరిన పేకాటరాయుళ్లు అర్ధరాత్రి తర్వాత ఇళ్లకు చేరుతున్నారు. అప్పటివరకు వారి మొబైల్స్ పనిచేయవు. పేకాటకు వసతి సమకూర్చినందుకు నిర్వాహకులు ఒక్కో ఆటకు రూ.10 వేల చొప్పున తీసుకుంటున్నట్లు సమాచారం. పేకాటరాయుళ్లు పెద్దమొత్తంలో డబ్బు పెట్టి ఈ పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. వీరిలో ఎక్కువ మంది సంపన్నులే ఉన్నట్లు సమాచారం. విచిత్రమేమిటంటే నిర్వాహకులతో పాటు పేకాటరాయుళ్లలో ఎక్కువ మంది గతంలో పోలీసుల దాడుల్లో పట్టుబడిన వారే. అలవాటు మార్చుకోలేక వీరందరూ ఇదే పనిగా పెట్టుకున్నట్లు తెలిసింది. మొబైల్ పేకాటలో పాల్గొంటున్న వారిలో అనేక మంది రూ.లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల ఒకరు రూ.90 లక్షలు, మరొకరు రూ.68 లక్షలు, ఇంకొకరు రూ.50 లక్షలు ఇలా చాలా మంది ఈ పేకాటలో డబ్బు కోల్పోయినట్లు తెలిసింది. ఇక్కడి పేకాటరాయుళ్లలోని కొందరిని వరంగల్‌లోని ఓ వ్యక్తి రైళ్ల ద్వారా పేకాట కోసం బల్లార్షకు పంపుతున్నట్లు సమాచారం.