వరంగల్, నవంబరు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ ఉమ్మడి జిల్లాకు రాజకీయంగా మరింత గుర్తింపు పెరిగింది. ఎమ్మెల్యే కోటాలో ఇటీవల ముగ్గురు జిల్లా నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం వచ్చింది. తాజాగా టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీ పదవి ఖాయమైంది. నామినేటెడ్ కోటాలో ఆయనకు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గవర్నర్ ఆమోదం కోసం మధుసూదనాచారి పేరును పంపింది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికార ఉత్తర్వులు రానున్నాయి. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న సిరికొండకు మరోసారి గుర్తింపు దక్కింది. తెలంగాణ తొలి సభాపతిగా పని చేసిన ఆయన శాసన మండలి సభ్యుడిగానూ అరుదైన గౌరవాన్ని పొందుతున్నారు.
ప్రస్తుత హనుమకొండ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లికి చెందిన మధుసూదనాచారి కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌లో పీజీ పూర్తి చేశారు. టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచిన ఆయన 1994లో అప్పటి శాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీడీపీలో జరిగిన పరిణామాలతో లక్ష్మీపార్వతితో కొనసాగారు. టీఆర్ఎస్ ఆవిర్భావం ముందు నుంచే కేసీఆర్‌తో కలిసి ఉన్నారు. టీఆర్ఎస్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. 2009లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2014లో గెలిచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్‌గా పని చేశారు. 2018 ఎన్నికల్లో భూపాలపల్లిలో ఓటమిపాలయ్యారు. 2001 నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఆయన సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం, పార్టీలో చేసిన కృషికి గుర్తింపుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిరికొండ మధుసూదనాచారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
దుగ్గొండి: తెలంగాణ మొదటి అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారికి ఎమ్మెల్సీ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపకుడు దేవేందర్ అన్నారు. శుక్రవారం గవర్నర్ కోటాలో మాజీ స్పీకర్‌కు ఎమ్మెల్సీ సీటు కేటాయించడంతో ఆయనకు స్వీటు తినిపించి శుభాకంక్షలు తెలిపారు.