వరంగల్, మార్చి 31 : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్న చందంగా మారింది వరంగల్ పెరికవాడలోని ప్రజల పరిస్థితి. అభివృద్ధి పనుల పేరుతో రైల్వే శాఖ మూడో లైన్ నిర్మాణ పనులు చేపడుతూ దశాబ్దాల కాలంగా ఉన్న నాలాను పూడ్చివేసింది. దీంతో కాలనీ మురికి కూపంగా మారింది. అగడ్త నుంచి శివనగర్ మీదుగా పెరికవాడ రైల్వేలైన్ పక్క నుంచి హంటర్ రోడ్డులోని 12 మోరీలను కలుపుతున్న నాలా ద్వారా మురుగునీరు ప్రవహిస్తోంది. ఇప్పుడు రైల్వే శాఖ మూడో లైన్ పేరుతో నాలాను పూర్తిగా పూడ్చివేయడంతో మురుగునీరు అంతా పెరికవాడను ముంచెత్తుతోంది. ఎండాకాలంలోనే ఇక్కడి ప్రజలు వర్షాకాలంలో మాదిరిగా ముంపు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వర్షాలు పడితే తలెత్తే పరిస్థితులను ఊహించుకుంటూ అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సమస్య జఠిలంగా మారుతున్నా అధికారులు అలసత్వం వహించడం విస్మయాన్ని కలిగిస్తోంది. కొన్ని రోజుల క్రితం సంబంధిత శాఖ అధికారులతో కలిసి కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. మురుగునీరు వెళ్లే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం సర్వే చేయాలని ఆదేశించారు. సుమారు రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు సర్వేలో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం.
మురుగునీటిలో కాలనీలు..
రైల్వే ట్రాక్ నాలా పక్కన ఉన్న కాలనీలన్నీ రెండు వారాలుగా మురుగునీటిలో మగ్గుతున్నాయి. నాలా పూర్తిగా పూడ్చివేయడంతో పై నుంచి వస్తున్న మురుగునీరు ముందుకు వెళ్లలేక పెరికవాడ గల్లీలోకి వెళ్తున్నది. దీంతో ప్రజలు మురుగు నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. గడప దాటాలంటే మురుగునీటిలో నడవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రోజుల తరబడి మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు, ఈగలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు గ్రేటర్ అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదని ప్రజలు వాపోతున్నారు.
నాలా రైల్వేలైన్లోనే..
ప్రస్తుతం ఉన్న నాలా సగానికి పైగా రైల్వే శాఖ స్థ లంలోనే ఉన్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ప ది రోజుల క్రితం గ్రేటర్ అధికారులతో కలిసి హద్దులు చూపించినట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే శరవేగంగా పనులు సాగుతున్నాయని, పనులు ముగిసిన తర్వాత రిటైనింగ్ వాల్ నిర్మిస్తామంటున్నారు. రిటైనింగ్ వాల్ తర్వాత మిగిలిన స్థలాన్ని కలుపుకుని నాలా నిర్మిం చాల్సి ఉంది. ఎగువ నుంచి వచ్చే మురుగు నీటిని అంచనా వేసి గ్రేటర్ అధికారులు 9 మీటర్ల వెడల్పుతో నాలా నిర్మాణానికి సర్వే చేశారు. మూడో లైన్ తర్వాత మిగిలిన స్థలాన్ని కలుపుకుని కొత్తగా 9 మీటర్ల నాలాను నిర్మిస్తామని వారు చెబుతున్నారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు చేసిన సర్వేలో సుమారు పదుల సంఖ్యలో భవనాలు అడ్డుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యామ్నాయంపై అలసత్వం..
మురుగునీటి మళ్లింపుపై కార్పొరేషన్ అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మురుగునీటిలో పెరికవాడ కాలనీలు మగ్గుతున్నా వాటిని మళ్లించే ప్రయత్నం చేయడం లేదు. ఇలా ఎన్ని రోజులు దుర్గంధంతో బతకాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించడంలో మాత్రం అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం చిన్న కాల్వ తవ్వి మురుగునీటి మళ్లీంపునకు చేపట్టిన చర్యలు సఫలం కాలేదు. దీంతో పెద్ద ఎత్తున మురుగు నీరు పెరికవాడ కాలనీల్లో నిండుతున్నది.
త్వరలో రైల్వే అధికారులతో సమావేశం..
రైల్వే మూడోలైన్ నిర్మాణంతో ఏర్పడిన నాలా సమస్యపై త్వరలో కమిషనర్ ప్రావీణ్య రైల్వే అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కొత్త లైన్ వేస్తూ ప్రస్తుత నాలాను పూడ్చివేడయంతో మురుగునీరు అంతా పక్కన ఉన్న పెరికవాడలోకి చేరుతోంది. రాబోయే రోజుల్లో సమస్య మరింత జఠిలమయ్యే అవకాశాలు ఉండడంతో కమిషనర్ రైల్వే అధికారులతో ఉగాది తర్వాత సమావేశం నిర్వహించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపాలని భావిస్తున్నారు.