మల్టీ సూపర్ స్పెషాలిటీహాస్పిటల్కు శంకుస్థాపన
24 అంతస్తుల్లో కెనడామోడల్లో నిర్మాణం
ఆ తర్వాత అర్బన్ కలెక్టరేట్ ప్రారంభోత్సవం
పర్యటన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నం
వరంగల్, జూన్13 : వరంగల్ హెల్త్హబ్కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21 సీఎం కేసీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన ఆదనపు కలెక్టర్, పంచాయతీ అధికారుల సమావేశంలో వరంగల్ పర్యటనకు వస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు అత్యాధునిక హంగులతో నిర్మించిన అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రజా వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ సర్కారు కృషిచేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన అభివృద్ధికి బాటలు వేయనుంది.
24 అంతస్తుల్లో నిర్మాణం
దేశంలో మెరుగైన సౌకర్యాలు ఉన్న హాస్పిటల్‌ను తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో నిర్మించనుంది. 63 ఎకరాల సువిశాల స్థలంలో 24 అంతస్తులతో నిర్మించే హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకరానున్నారు. కెనడా తరహాలో గాలి, వెలుతురు ప్రసరించేలా క్రాస్ వెంటిలేషన్ పద్ధతుల్లో నిర్మించాలని ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అక్కడి నిర్మాణాలపై అధ్యయనం చేసేందుకు వైద్యాధికారుల బృందాన్ని కెనడా పంపనున్నారు. కార్పొరేట్ హాస్పిటల్‌కు దీటుగా మెరుగైన వైద్యం అందించేలా వైద్య సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే సెంట్రల్ జైల్లోని ఖైదీలను ఇతర జైళ్లకు తరలించారు. జైలు స్థలాన్ని వైద్య శాఖకు అప్పగించే ప్రక్రియ శరవేగంగా పూర్తి చేశారు. మూడు రోజులుగా జైల్ కూల్చివేత కొనసాగుతోంది.
హాస్పిటల్‌పైనే హెలిప్యాడ్
దేశంలో ఎక్కడా లేని విధంగా వరంగల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ అసుపత్రి నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగుల కోసం హాస్పిటల్ పైనే హెలిక్యాప్టర్ దిగేలా హెలిప్యాడ్ ఏర్పాటుచేయనున్నారు.
ప్రారంభానికి కలెక్టర్ కార్యాలయం సిద్ధం
ఆధునిక హంగులతో నిర్మించిన అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సిద్ధమైంది. రాష్ట్రంలోనే వరంగల్ అర్బన్ కలెక్టర్ కార్యాలయం మోడల్‌గా నిలువనుంది. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు.