కరీమాబాద్, జూలై 24: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలను చేపడుతున్న నేపథ్యంలో పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ ఆధ్వర్యంలో మామునూరులోని పీటీసీలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చొరవతో ఏకకాలంలో 86 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కన్నవారి కలలను నిరుద్యోగులు సాకారం చేయాలన్నారు.
ఉద్యోగాలతోపాటు పెట్టుబడులతో ప్రైవేట్ రంగాల్లోనూ ప్రభుత్వం యువతకు అవకాశాలను కల్పిస్తున్నదన్నారు. వ్యాపార రంగంపై దృష్టి సారించి నూతన ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు. అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 100 రోజులపాటు సాగిన కోచింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వందలాది మంది అభ్యర్థులకు ఉచితంగా నాణ్యమైన కోచింగ్‌ను అందిస్తున్న అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్‌ను అభినందించారు.
అనంతరం మంత్రి దయాకర్‌రావును నిర్వాహకులు సత్కరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ యువత కోసం అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇచ్చామన్నారు. పేదవారు, వసతులు లేని వారు సైతం ఉద్యోగాలను సాధించాలనే ఉచిత శిక్షణ అందించామని చెప్పారు. యువతకు దిశానిర్దేశం చేసేందుకు వివిధ రంగాల అధికారులను తీసుకువచ్చి లెక్చర్స్ ఇచ్చామని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి మాట్లాడుతూ ఉద్యోగం కోసం శ్రమించే యువతకు పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు.
ఉద్యోగాన్ని సాధించేందుకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షను ఇదే చివరి అవకాశంగా భావించి శ్రమించాలన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ రచ్చ రవి కామెడీతో ఆకట్టుకోగా, ఇండియన్ రాపల్ రోల్ రైడ పాటలతో హోరెత్తించారు. అదేవిధంగా మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే రమేశ్ కేక్ కట్ చేశారు. పీటీసీ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అరుణ, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.