సంగెం, జూలై 22: మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యే అధికారులు నివేదికలు ఇవ్వకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎంపీపీ కందకట్ల కళావతి హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు కోరం వరకే హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను సభలో చదివి వినిపించారు. పీఆర్ ఏఈ రమేశ్ మాట్లాడుతూ మన ఊరు-మనబడిలో భాగంగా మండలానికి రూ. 2.58 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. నాలుగు గ్రామాల్లోని పాఠశాలల్లో మాత్రమే పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. మిగతా గ్రామాల్లో పనుల్లో వేగం పెంచాలని ప్రజాప్రతినిధులను కోరారు. మండలంలో 77 చెరువులు ఉన్నాయని, 22 చెరువులు అలుగు పోస్తున్నట్లు ఐబీ ఏఈ హమీద్ తెలిపారు. నల్లబెల్లి ఊర చెరువు, కొండ సముద్రం చెరువు కట్టలు కొంత దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతుల కోసం ఎస్టిమేషన్ వేసి పంపించామన్నారు.
హరితహారంలో మండలంలో లక్షా 40 వేల మొక్కలు నాటాలని టార్గెట్ ఇచ్చారని, విజయవంతం చేసేందుకు సహకరించాలని ఏపీవో లక్ష్మి కోరారు. మండలంలో రూ. 76 లక్షల పన్నులు డిమాండ్ ఉందని, ఇప్పటి వరకు రూ. 2.50 లక్షలు వసూలు చేశామని ఎంపీవో కొమురయ్య తెలిపారు. జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే సభకు ప్రజాప్రతినిధులు హాజరు కాకపోతే సభ ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెప్రగతి కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఎన్ని పనులు చేశారో నివేదికలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ కళావతి మాట్లాడుతూ విద్యుత్ తీగల కింద మొక్కలు నాటొద్దన్నారు. సమావేశంలో ఎంపీడీవో ఎన్ మల్లేశం, తాసిల్దార్ రాజేంద్రనాథ్, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఏవో యాకయ్య, పశువైద్యాధికారి వల్లెరాజు పాల్గొన్నారు.