దుగ్గొండి/నెక్కొండ/నర్సంపేటరూరల్, జూలై 19: ఊరూరా పారిశుధ్య పనులు జోరుగా కొనసాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా శుక్రవారం దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి, గోపాలపురం, తిమ్మంపేట, దుగ్గొండి పారిశుధ్య పనులు చేశారు. ఎంపీడీవో కృష్ణప్రసాద్ పనులను పరిశీలించి జీపీ మల్టీపర్పస్ వర్కర్లకు సూచనలు చేశారు. గ్రామస్తులు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీధర్‌గౌడ్, సర్పంచ్‌లు రమేశ్, విద్యాసాగర్‌గౌడ్, నీలం పైడయ్య, కార్యదర్శి సరిత, రమేశ్, అశోక్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నెక్కొండ మండలం అలంకానిపేటలో పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది వీధులను శుభ్రం చేస్తూ అవసరమైన చోట బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. కార్యదర్శి మధు పనులను పర్యవేక్షిస్తున్నారు. నర్సంపేట మండలంలోని గురిజాల, లక్నేపల్లి, రాజపల్లి, ముగ్దుంపురం, రాములునాయక్‌తండా, చిన్నగురిజాలలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. వీధులను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గొడిశాల మమత, గొడిశాల రాంబాబు, భాగ్యమ్మ, పెండ్యాల జ్యోతి, మాధవి, సుజాత, కార్యదర్శులు, కారోబార్లు పాల్గొన్నారు.
ఆయిల్ బాల్స్‌తో దోమల నివారణ
నల్లబెల్లి: మురుగునీటి గుంతలు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిలో ఆయిల్ బాల్స్ వేస్తే దోమలను నివారించొచ్చని ఎంపీవో కూచన ప్రకాశ్ సూచించారు. నాగరాజుపల్లెలో నీటి గుంతల్లో ఆయన జీపీ సిబ్బందితో ఆయిల్‌బాల్స్ వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొడి వస్త్రంలో రంపపుపొడిని పోసి ముద్ద గా చేసి నిరుపయోగంగా ఉన్న ఇంజిన్ ఆయిల్లో రెండు రోజులు నానబెట్టాలని సూచించారు. మూ డో రోజు నానబెట్టిన ఆయిల్బాల్స్ను నీరు నిల్వ ఉన్న గుంతల్లో వేస్తే దోమలు, లార్వా అంతరించిపోతుందని తెలిపారు. అన్ని గ్రామాల్లో ఈ పద్ధతి ని అవలంబించాలని కోరారు. అనంతరం ఆయ న గోవిందాపూర్‌లో నాలుగు వేల మొక్కలు నాటే కమ్యూనిటీ ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. సర్పంచ్ గోనె శ్రీదేవి, కార్యదర్శులు సంతోష్, శాంత, శ్రీవణ్, రంజిత్ పాల్గొన్నారు.