వరంగల్‌చౌరస్తా, జూలై 21 : ఆయుష్ సేవలను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయుష్ ఇన్చార్జి డైరెక్టర్ ప్రశాంతి అన్నారు. గురువారం ఆమె వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎంజీఎం దవాఖానలోని హోమియోపతి విభాగం, అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా దవాఖానలోని పలు విభాగాలను పరిశీలించారు. రికార్డును పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హెల్త్‌హబ్‌లో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు వరంగల్ కేంద్రంగా ఆయుష్ సేవల పనితీరును మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఆయుష్ సేవల వివరాలను తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి, వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.