వరంగల్, జూలై 20 ( నమస్తే తెలంగాణ) : పాలు.. ప్రతి ఒక్కరి నిత్యావసరం, మరీ ముఖ్యంగా పిల్లలకు పౌష్టిహాకారం.. అలాంటి పాలు, అనుబంధ ఉత్పత్తులపై ఏమాత్రం ఆలోచన లేకుండా కేంద్రం జీఎస్టీ విధించడంపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. రోజురోజుకూ ధరల భారం మోపుతున్న బీజేపీ సర్కారు తీరును నిరసిస్తూ బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు వెల్లువెత్తాయి. పాల ఉత్పత్తులపై జీఎస్టీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. పాల ప్యాకెట్లు, పెరుగు డబ్బాలతో ప్రజలు రోడ్లపైకి వచ్చి కదం తొక్కారు. ‘పిల్లలకు కనీసం పాలు కూడా లేకుండా చేస్తారా’ అంటూ దుమ్మెత్తిపోశారు. పలుచోట్ల బర్రెలను తోలుకొచ్చి రహదారులపై ధర్నా చేశారు.
పాలు, అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీకి వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. ప్రధాని మోదీ, కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను పార్టీ శ్రేణులు దహనం చేశాయి. పలు చోట్ల బర్రెలతో ఆందోళన చేపట్టారు. ప్రజలు సైతం తోడై రోజురోజుకూ ధరల భారం మోపుతున్న బీజేపీ సర్కారు తీరును ఎండగట్టారు. పాల ప్యాకెట్లు, పెరుగు డబ్బాలతో రోడ్లపైకి వచ్చి కదం తొక్కారు. ‘పిల్లలకు పాలు కూడా దొరకనివ్వరా’ అంటూ బీజేపీ నేతలపై దుమ్మెత్తిపోశారు.
హనుమకొండలో చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆదేశాల మేరకు కార్పొరేటర్ సోదా కిరణ్ ఆధ్వర్యంలో కేయూ జంక్షన్లో బుధవారం ధర్నా, రాస్తారోకో చేశారు. ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అదాలత్ వద్ద డీసీసీబీ చైర్మన్ రవీందర్రావు, పాలక మండలి సభ్యులు ధర్నా చేశారు. పాల ప్యాకెట్లు, పెరుగు డబ్బాలతో నిరసన తెలిపారు. యాదవనగర్ ప్రధాన రహదారిపై కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఇక్కడా బర్రెలను తోలుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు.
కాజీపేట, భీమదేవరపల్లి మండలం ముల్కనూరు, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, కమలాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో చేశారు. వరంగల్ పోస్టాఫీస్ సెంటర్, చౌరస్తా, దేశాయిపేట రోడ్డు, ఎల్బీనగర్, గోపాలస్వామి గుడి సెంటర్, బ్యాంకు కాలనీలోని గాంధీ విగ్రహం వద్ద, నర్సంపేట, రాయపర్తి, పర్వతగిరిలో ధర్నాలు కొనసాగాయి. వర్ధన్నపేట పట్టణ కేంద్రం సమీపంలోని ఇల్లంద గ్రామం వద్ద ఏఎంసీ ఎదుట జాతీయ రహదారిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బర్రెలను తోలుకొచ్చి రోడ్డుపై నిరసన తెలుపగా చిన్న పిల్లలు గ్యాస్ బండలతో ఆందోళన చేశారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రంలోనూ కేంద్ర ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. జనగామలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలక్యాన్‌తో టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ములుగు జిల్లా కేంద్రంలో, మంగపేట మండల కేంద్రంలోని గంపోనిగూడెం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.