మడికొండ, జూలై 20: ప్రతి వ్యక్తి జీవితంలో విలువలతో కూడిన జీవితం గడపాలని, విలువలు లేని జీవితంతో సంతోషంగా ఉండలేమని ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ గౌర్ గోపాల్ దాస్ యువతకు ఉద్బోధించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో యువతకు దిశానిర్దేశం చేయడం కోసం ఆయన ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాచకొండ, వరంగల్ పోలీస్ కమిషనర్లు మహేశ్‌భగవత్, డాక్టర్ తరుణ్‌జోషి, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు.
ఈ సందర్భంగా వక్త గౌర్ గోపాల్ దాస్ ప్రసంగిస్తూ ప్రతి ఒకరూ తమ జీవితంలో సుఖ సంతోషాలను డబ్బుతో కొనలేరని చెప్పారు. విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని, జీవితంలో డబ్బు మన అవసరాలకు తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి మనిషి వస్తువులను. ఆస్తులను సొంతం చేసుకోవాలని అనుకోవడం కంటే మెరుగైన జీవితాన్ని గడపాలని కోరుకోవాలని సూచించారు. భౌతిక వస్తువులు మనకు సంతృప్తి, ఆనందాన్ని కలిగించలేవని చెపాపరు. పకవారితో పోటీపడే దానికన్నా తన అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేయాలో దానిపై దృష్టి పెడితే వ్యక్తిగత అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో విలువలకు ప్రాధాన్యం తగ్గిందని వివరించారు. కార్యక్రమంలో ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, డీసీపీలు వెంకటలక్ష్మి, అశోక్ కుమార్, సీతారాం, అదనపు డీసీపీలు వైభవ్ గైక్వాడ్, పుష్పారెడ్డి, గౌస్ఆలం, బెటాలియన్ పోలీస్ అధికారులు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు, నగర ప్రముఖులు, నిట్ అధికారులు, పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.