వరంగల్ చౌరస్తా, జూలై 19 : తలసేమియా బాధితులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్‌దాస్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం ప్రత్యేక రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో దీనిపై చర్చించడానికి ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ చాంబర్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఐసీఎంఆర్ కోరిన అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు ఎంజీఎంలో లేదా కేఎంసీలో సెంటర్ ఏర్పాటుకు అవసరమైన వసతిని కల్పించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
వరంగల్ కేంద్రాన్ని హెల్త్ హబ్‌గా మార్చడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. దీనికి అనుగుణంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ఐసీఎంఆర్ ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో తలసేమియా బాధితులకు చాలా మేలు జరుగుతుందన్నారు. వారి ప్రాణాలు కాపాడటానికి ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ విభాగం అధ్యక్షుడు బైరం బాలాజీ, కార్యదర్శి నాగార్జునరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పీ విజయచందర్‌రెడ్డి, ఒమెగా బన్ను హాస్పిటల్ ఎండీ డాక్టర్ చరణ్‌జిత్‌రెడ్డి, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ ప్రసాద్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి భిక్షపతిరావు, ప్రొఫెసర్ డాక్టర్ సురేందర్, ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.