నర్సంపేట, జూలై 19 : వడగండ్లతో పంటలు నష్టపోయిన రైతులకు త్వరలో నష్టపరిహారం అందించనున్నారు. ఈ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. జనవరి నెలలో పడిన వడగండ్ల వానతో మిర్చి, మక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. వారికి నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆగస్టు మొదటి వారంలో రైతులకు నష్టపరిహారం అందుతుందని పేర్కొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 18 వేల ఎకరాల్లో సాగవుతున్న మక్కజొన్న, మిర్చి పంటలు జనవరిలో కురిసిన అకాల వర్షం, వడగండ్లతో పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ నష్టపరిహారంతో 13,100 ఎకరాల మిర్చి రైతులు, 5 ఎకరాల మక్కజొన్న రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు వివరించారు.
కాగా, వడగండ్లతో వరంగల్ జిల్లాలోని నర్సంపేటలోనే ఎక్కువగా పంట నష్టం జరిగింది. ఇక్కడ నష్టపోయిన రైతుల బాధను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్వయంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వినిపించారు. దీంతో ముఖ్యమంత్రి అప్పట్లోనే వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి పంట నష్టంపై సమీక్షించారు. నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో రైతులకు నష్టపరిహారం అందజేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నిర్ణయించారు. దీనికి ఆర్థికశాఖ కూడా ఆమోదం తెలుపగా ఆ ఫైల్ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరిందని ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. సీఎం కేసీఆర్ అనుమతితో ఆగస్టు మొదటి వారంలో నష్టపరిహారం అందజేయనున్నట్లు ఆయన వివరించారు.