సుబేదారి, జూలై 19 : 2021-22 ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను బకాయిలుపై వడ్డీని 90శాతం మాఫీ చేస్తూ, 10శాతం మాత్రమే చెల్లించే వెసలుబాటు కల్పించామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం వరంగల్లోని మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 90శాతం వడ్డీ మాఫీ అవకాశాన్ని నగర వాసులు వినియోగించుకోవాలని కోరారు. అక్టోబర్ 31 తేదీలోపు చెల్లించడానికి అవకాశం ఉందన్నారు. మొండి బకాయిల వసూళ్ల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 90శాతం వడ్డీ మాఫీలో వరంగల్ మున్సిపల్ పరిధిలో రూ.21కోట్ల97లక్షలు పెండింగ్లో ఉన్నాయని, వీటి వసూలులో రెవెన్యూ అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈసంవత్సరం రూ.88కోట్ల 59లక్షలు పన్నుల వసూళ్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.27కోట్ల77లక్షలు వసూలు అయినట్లు కమిషనర్ తెలిపారు. ప్రచార మాధ్యమాల ద్వారా 90శాతం వడ్డీ మాఫీ పథకాన్ని ప్రచారం చేసి నగర వాసులకు అవగాహన కల్పించాలని అదికారులను ఆదేశించారు. ఆర్ఐలు రోజువారీ వసూళ్ల వివరాలు అందజేయాలని, విధినిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిటిజన్ చార్టర్ను పటిష్టంగా అమలు చేస్తూ, ఇంటి నంబర్ల కేటాయింపు, ఆస్తి పేరు మార్పిడీ, బైఫర్కేషన్, కొత్త అసెస్మెంట్ సమస్యలను గడువులోగా పరిష్కరించాలన్నారు.