గిర్మాజీపేట, జూలై 19 : పంటలకు పుట్టినిల్లు ఓరుగల్లు అని.. పారిశ్రామిక రంగంలో అత్యాధునిక విధానాలను ఉపయోగించి జిల్లాలో ఎగుమతులను పెంపొందించే దిశగా అధికారులు, పారిశ్రామికవేత్తలు కృషిచేయాలని తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ ముఖ్యసలహాదారు బీపీ ఆచార్య సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యాపార, వాణిజ్యరంగం సాధికారితపై జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, వాణిజ్య, వ్యాపార వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధానంగా పంటలైన కాటన్, మిరప, ఉత్పత్తుల నాణ్యతను పెంచి తద్వారా ఎగుమతులను పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఐటీఐ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్యాసంస్థల విద్యార్థులకు పారిశ్రామిక రంగంలో కావాల్సిన శిక్షణను ఇప్పించి వారికి త్వరగా ఉపాధి లభించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఇండో-జర్మన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఉన్న అవకాశాలను వివరించారు.
జిల్లాలో పారిశ్రామిక ఉత్పత్తులను అమెజాన్ ద్వారా అమ్మేందుకు జూలై, ఆగస్టు నెలలో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వ్యాపార, వాణిజ్య వర్గాలకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించాల్సిన ఎంతైనా ఉందని సూచించారు. జీనోమ్ వ్యాలీ ఉత్పత్తి చేసే సేంద్రియ ఎరువుల ద్వారా కాటన్, మిర్చి దిగుబడి విస్తృతంగా పెంచవచ్చని ఆ దిశగా జిల్లా యంత్రాంగం, పారిశ్రామికవేత్తలు అడుగులు వేయాలని అన్నారు. పంటలు పండించే విధానంలో రైతులకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారికి సలహాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భూక్యా హరిసింగ్, శ్రీవత్స కోట, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సెక్రటరీ మడూరి వేదప్రకాశ్, జిల్లా పారిశ్రామిక శాఖ జనరల్ మేనేజర్ నర్సింహమూర్తి, డీఆర్డీఏ పీడీ సంపత్‌రావు, రైస్‌మిల్లర్స్, కాటన్, చిల్లీ ఇండస్ట్రీలకు సంబంధించిన వ్యాపారులు, వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.