వరంగల్, జూలై18 (నమస్తే తెలంగాణ):కుండపోతగా కురిసిన వర్షం.. తడిసిన ధాన్యం.. బూజుపట్టిన సంచులు.. వానకు నాని బస్తాల్లోనే మొలకెత్తిన వడ్లు.. నారుమడులను తలపిస్తున్న మిల్లుల ఆవరణలు.. ఇంతటి దయనీయ స్థితికి ఎందు కొచ్చింది..?, ఈ దారుణ పరిస్థితికి కారకులెవరంటే అన్ని వేళ్లూ కేంద్ర ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని ఖాళీ చేయకపోగా, నెలన్నరగా మిల్లింగ్ నిలిపివేయడంతో యాసంగిలో సేకరించిన ధాన్యమంతా మిల్లుల్లో అలాగే ఉండిపోయింది. కేవలం మోదీ సర్కారు నిర్లక్ష్యం వల్లే మిల్లుల వద్ద నిల్వ చేసిన వడ్లు వర్షార్పణమయ్యాయి. జిల్లాలో సుమారు రూ. 500 కోట్ల ధాన్యం పేరుకుపోయింది. బాయిల్డ్ రైస్ తీసుకోలేమని గత యాసంగి బియ్యం సేకరణకు కేంద్రం ముందుకు రాకపోగా వానాకాలం బియ్యం సేకరణ కూడా మధ్యలోనే ఆపేసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కత్తి గట్టింది. ఆర్థికంగా దెబ్బతీసేందుకు అనేక కుట్రలు చేస్తోంది. ఈ క్రమంలో నెల పదిహేను రోజుల నుంచి కేంద్రం పూర్తిగా బియ్యం సేకరణ నిలిపివేసింది. దీంతో జిల్లాలోని రైస్‌మిల్లుల్లో సుమారు రూ.500 కోట్ల ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. మిల్లుల లోపల, ఆరు బయట ఇవి గుట్టలుగా పడి ఉన్నాయి. ఫలి తంగా బయట ఉన్న ధాన్యం నిల్వలు కొద్ది రోజుల నుంచి వర్షాలతో తడిసిపోతున్నాయి. వర్షాలు ఎడ తెరిపి లేకుండా పడుతుండడంతో మొలకెత్తుతున్నాయి. గన్నీ సంచుల్లోనే పనికిరాకుండా పోతున్నాయి. వెరసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఆహార భద్రతా చట్టం ప్రకారం గతంలో కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్రం నుంచి వానాకాలం, యాసంగి బియ్యాన్ని సేకరించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నూర్పిడి కోసం కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) విధానంపై రైస్‌మిల్లర్లకు కేటాయించింది. మిల్లర్లు దీన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద బియ్యాన్ని నిర్దేశిత గడువులోగా రాష్ట్ర ప్రభుత్వానికి డెలివరీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యం నుంచి రాష్ట్ర అవసరాలకు పోగా మిగిలిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా(ఎఫ్‌సీఐ)కు అప్పగించింది. ఈ విధానం వల్ల రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వలు ఉండకపోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంపైనా ఆర్థిక భారం పడేది కాదు. తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బియ్యం సేకరణలో ఇన్నాళ్లు అమల్లో ఉన్న విధానాన్ని ఈ ఏడాది అటకెక్కించింది.
గత యాసంగి సీజన్ ఆరంభంలో కొత్త పల్లవి అందుకుంది. ఎఫ్‌సీఐ ద్వారా కేవలం ‘రా’ రైస్ మాత్రమే సేకరిస్తామని ప్రకటించింది. తెలంగాణలో యాసంగి ‘రా’ రైస్ రాదని, బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుందని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా నయా పాలసీని తెచ్చింది. దీనిపై టీఆర్ఎస్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ధర్నాలు, రాస్తారోకో, రైలురోకోలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు
తెలంగాణ రైతుల కోసం టీఆర్ఎస్ కొట్లాడినా కేంద్రం వడ్ల కొనుగోలుకు ససేమిరా అంది. యాసంగి వడ్లను కొనబోమని ప్రకటించింది. దీంతో యాసంగి వరి పంట సాగు చేసిన రైతులు నష్టపోవద్దని సీఎం కేసీఆర్ మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభు త్వం గ్రామాల్లో గతంలో మాదిరిగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మద్దతు ధరతో రైతుల నుంచి నేరుగా యాసంగి ధాన్యం కొనుగోలు జరిపింది. క్విం టాలు సాధారణ రకానికి రూ.1,940, గ్రేడ్”ఏ’ రకానికి రూ.1,960 లెక్కన ధాన్యం రైతులకు చెల్లించింది. జిల్లాలో ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ 22 వరకు 99 వేల టన్నుల యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
ఈ ధాన్యం విలువ రూ.194 కోట్లు. దీన్ని సీఎంఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని రైస్‌మిల్లులకు కేటాయించింది. గ్రామాల్లో కొను గోలు కేంద్రాల వద్ద రైతుల నుంచి కొన్న 99 వేల టన్నుల ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించింది. అప్ప టికే ఈ రైస్‌మిల్లుల్లో వాన కాలం ధాన్యం నిల్వలు ఉన్నాయి. దీంతో సదరు మిల్లుల యజమానులు ప్రభుత్వం తమకు కేటాయించిన యాసంగి ధాన్యంలో కొంత రైస్‌మిల్లు లోపల, మరికొంత మిల్లు ఆవరణలో ఆరు బయట నిల్వ చేశారు. కొన్ని రైస్‌మిల్లుల్లో యాసంగి ధాన్యం మొత్తం ఆరు బయటే పెట్టారు. కేంద్రంలోని బీజేపీ విధానాల వల్ల ఏ ఒక రైస్‌మిల్లులోనూ యాసంగి ధాన్యం నూర్పిడి మొదలు కాలేదు. ఇప్పటికీ యాసంగి బియ్యాన్ని సేకరించేందుకు కేంద్రం ముందుకు రాలేదు. ఫలితంగా రైస్‌మిల్లుల ఆవరణలో బయట నిల్వ చేసిన యాసంగి ధాన్యం పూర్తిగా కొద్దిరోజుల నుంచి కురుస్తున్న ఏకధాటి వర్షాలతో తడిచిపోయింది. నీటితో నాని ఎందుకు పనికిరాకుండా మొలకెత్తింది.
వాన కాలం ధాన్యం అంతే
రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్, డిసెంబర్లో జిల్లాలో రైతుల నుంచి నేరుగా 2.73 లక్షల టన్నుల వాన కాలం ధాన్యం కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు రూ.535 కోట్లు. క్వింటాలు సాధారణ రకానికి రూ.1,940, గ్రేడ్”ఏ’ రకానికి రూ.1,960 చొప్పున ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లిం చింది. 2.73 లక్షల టన్నులధాన్యాన్ని సీఎంఆర్ విధానంపై జిల్లాలోని రైస్‌మిల్లర్స్‌కు కేటాయించింది. మిల్లర్స్ సుమారు 1.17 లక్షల టన్నుల ధాన్యం మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి 78 వేల టన్నుల వాన కాలం బియ్యం డెలివరీ చేశారు. ఈ క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వానాకాలం బియ్యం సేకరణ కూడా నిలిపివేసింది. బియ్యం సేకరణ నిలిపివేస్తున్నట్లు గత జూన్ 7న ఎఫ్‌సీఐ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రైస్‌మిల్లుల్లో నిల్వలు ఎక్కడివక్కడే ఉండిపోయాయి.
జిల్లాలోని రైస్‌మిల్లుల్లో వానకాలం ధాన్యం నిల్వలు ఇంకా 1.56 లక్షల టన్నులు ఉన్నట్లు తెలిసింది. దీని విలువ సుమారు రూ.306 కోట్లు. ఇందులో చాలావరకు రైస్‌మిల్లుల ఆవరణలో బయట నిల్వ చేయడం వల్ల వర్షాలతో తడిచి మొలకెత్తుతోంది. వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సుమారు రూ.500 కోట్ల విలువైన 2.55 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు జిల్లాలోని రైస్‌మిల్లుల్లో పేరుకుపోయినట్లు సమాచారం. కేంద్రం వైఖరితో ఈ ధాన్యం పాడైపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోంది. రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వల వల్ల రైస్‌మిల్లర్లు ఆర్థికంగా నష్టపోతున్నారని, తడిచి మొలకెత్తుతున్న ధాన్యం ఎందుకూ పనికిరాకుండా పోతుందని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల రవీందర్ అన్నారు.