వరంగల్ చౌరస్తా, జూలై 18 : ఉత్తర తెలంగాణ ప్రజలకు కార్పొరేట్ స్థాయికి మించి ఉచిత ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌తో కలిసి హాస్పిటల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో పురోగతి, నమూనాలను గురించి సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి వైద్యం కోసం ఎవరూ హైదరాబాద్ వెళ్లే అవసరం లేకుండా అన్ని సౌకర్యాలతో అత్యాధునిక స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం మంత్రి హరీశ్ విలేకరులతో మాట్లాడారు. ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాలు తీర్చేందుకు 56 ఎకరాల స్థలంలో సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగానే ఏడాది కాలంలో పూర్తిచేసేందుకు వేగంగా పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 700 మంది కార్మికులు పనులు చేస్తున్నారని, వెంటనే 2500తో మూడు విడుతలు.. 24గంటలు కొనసాగించాలని కాంట్రాక్టు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పనుల పురోగతితో పాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. వందేళ్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన నిర్మాణ పనుల్లో పకడ్బందీగా ఉండాలన్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సంబంధిత అధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఇంతటి భారీ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండటానికి గాను ఎయిర్‌పోర్టు, ఫైర్‌సేఫ్టీ, జైళ్ల శాఖ, తదితర విభాగాల అనుమతులు తీసుకున్నామని చెప్పారు. 24అంతస్తుల భవనంతో 16 అంతస్తులను వైద్య సేవలు అందించడానికి, మిగిలిన 8 అంతస్తులను పరిపాలనా విభాగాలు, సెమినార్ హాల్స్, పలు విభాగాలకు కేటాయింపు చేస్తామని, అందులోనే అత్యంత ఆధునిక లైబ్రరీ ఏర్పాటు చేస్తామన్నారు. నిర్మాణ పనులు పూర్తయ్యే నాటికి వైద్యులు, సిబ్బంది నియామకాలకు ఏర్పాట్లు చేస్తామని, అలాగే వైద్య పరికరాలను సైతం అనుకున్న సమయానికి అందేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నారు.