ఏటూరునాగారం, జూలై 18 : వరద బాధితులకు అండగా ఉండాలని ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. సోమవారం ఏటూరునాగారం ఐటీడీఏ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ శ్రీనివాస్‌రావు, ములుగు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ఎస్ కృష్ణ ఆదిత్య, రాజీవ్‌గాంధీ హనుమంతు, గోపి, ఐటీడీఏ పీవో అంకిత్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌తో కలిసి ములుగు, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ములుగులో ఆర్టీసీ బస్సు డిపో, ఏటూరునాగారం మండల కేంద్రానికి ఫైర్ స్టేషన్ మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న వివిధ నిర్మాణాల స్థానంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినందుకు, అదేవిధంగా వరద బాధితుల పునరావాసానికి, రోడ్ల మరమ్మతులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. వరద తగ్గుముఖం పట్టినందున సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులు దీనిన్ని సవాల్‌గా తీసుకోవాలని చెప్పారు. వరద బాధితులకు రూ.10వేల నగదు, నిత్యావసర సరుకులు ఇవ్వాలని సూచించారు. అలాగే వారికి నాణ్యమైన సేవలందించాలని కోరారు. చెరువులు, ఇతర జలాశయాలు, గట్లపై దృష్టిపెట్టాలన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు నివేదికలను అందించాలని కోరారు.
ఎలాంటి పరిస్థితులోనైనా ఎదురొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా వ్యవసాయశాఖ అధికారులకు సూచన చేయాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి సూచించారు. కలెక్టర్లకు గతంలో ఐటీడీఏ పీవోలుగా పనిచేసిన అనుభవం ఉన్నందున హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో పాటు రామగుండం సీపీని స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం ములుగుకు నియమించిందని చెప్పారు. కలెక్టర్లు తీసుకున్న పకడ్బందీ చర్యల వల్లే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని ఈ సందర్భంగా వారిని అభినందించారు.
ప్రాణనష్టం జరుగకుండా అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ సేవలను కూడా జిల్లాలో వినియోగిస్తున్నట్లు తెలిపారు. ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ మాట్లాడుతూ వరద సహాయం అందించడంలో ప్రభుత్వ అధికారులది కీలక పాత్ర అన్నారు. గ్రామాల్లో గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో శానిటేషన్ పకడ్బందీగా చేపట్టాలని కోరారు. స్పెషల్ ఆఫీసర్ రామగుండం సీపీ మాట్లాడుతూ ఈ దఫా గతంలో ఎన్నడూ కురవని వర్షాలు కురిశాయని పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో వరద సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నదని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌వో అప్పయ్య, ఏఎస్పీ అశోక్‌కుమార్, జడ్పీటీసీ వలియాబీ, ఎంపీపీ విజయ, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
బాగోగులు తెలుసుకొని.. భోజనం వడ్డించి
వరద బాధితుల పునరావాసం కోసం ఏటూరునాగారంలో ఏర్పాటుచేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, గిరిజన, స్త్రీ, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న ఎస్సీ కాలనీవాసులను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఆ తర్వాత వారితో కలిసి భోజనం చేశారు. పకన కూర్చుని స్వయంగా ఆమె వడ్డించారు. ముందుగా బాధితులతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి పకన కూర్చున్న ఎంపెల్లి రాంబాయితో మాటముచ్చట చేసి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వరదతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఇంట్లో వస్తువులన్నీ మునిగిపోతున్నాయని, తమకు ఇంటి స్థలంతోపాటు ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కన్నీళ్లు పెట్టుకొని తన గోడు వెల్లబోసుకుంది. స్పందించిన మంత్రి ఆమెను ఓదార్చి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత అదే సెంటర్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. అన్ని మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. క్యాంపులు నిర్వహిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, జిల్లా కోఆప్షన్ సభ్యురాలు వలియాబీ, ఎంపీపీ విజయ, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, రాజ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకులు సునీల్‌కుమార్, తుమ్మ మల్లారెడ్డి, ఖాజా బాషా తదితరులు ఉన్నారు.
మేడారం స్ఫూర్తితో పనిచేయాలి
మేడారం జాతర స్ఫూర్తితో అధికారులు పనిచేసి వరద ప్రాంత బాధితులకు నాణ్యమైన సేవలందించాలని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య కోరారు. 24 గంటలు అధికారులు అందుబాటులో ఉంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి పరిషరించాలని ఆదేశించారు. ఈ నెల చివరి వరకు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈమేరకు రెస్యూ టీములను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
– ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య
అప్రమత్తంగా ఉండాలి
హనుమకొండ జిల్లా నుంచి వచ్చిన అధికారులకు వాజేడు, వెంకటాపురం మండలాల్లో విధులు కేటాయించినందున ఆ రెండు మండలాల్లో పకడ్బందీగా సేవలు అందించాలని స్పెషల్ ఆఫీసర్, హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒకరూ పనిచేయాలన్నారు. వరద బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని కోరారు. వారిపట్ల మానవతా దృక్పథాన్ని చూపించాలన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, ములుగు జిల్లా అధికారులతో కలిసి సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.
– హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
సమన్వయంతో పనిచేయాలి
వరద సహాయక చర్యల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని స్పెషల్ ఆఫీసర్, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. వరంగల్ జిల్లా నుంచి వచ్చిన అధికారులకు కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల్లో విస్తృ్తతంగా పర్యటించి స్థానిక అధికారులతో కలిసి సమస్యలను పరిషరించాలని కోరారు. ఈ నెల 29వరకు అధికారులు తమకు కేటాయించిన విధుల్లో నిమగ్నమై నిబద్ధతతో పనిచేయాలన్నారు.
– వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి