గిర్మాజీపేట, జూలై 18 : సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంహెచ్‌వో కాజీపేట వెంకటరమణ ఆదేశించారు. సోమవారం ఆయన కీటక జనిత వ్యాధులపై అన్ని పీహెచ్‌సీల సూపర్వైజర్లు, ల్యాబ్టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున దోమల వ్యాప్తి నివారణకు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పీహెచ్సీలో రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని వైద్య సిబ్బందికి చెప్పారు. విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్ మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశ కార్యకర్త నుంచి సూపర్వైజర్ వరకు ఇంటింటా జ్వరసర్వే చేయాలని ఆదేశించారు. జ్వరంతో బాధపడుతున్న వారి నుంచి రక్తనమూనాలను సేకరించి తగిన వైద్యం అందించాలని చెప్పారు. సమావేశంలో ఇన్చార్జి అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ మాడిశెట్టి శ్రీనివాస్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్లు శ్రీనివాస్, నంద, విజయేంద్రకుమార్, హెల్త్‌ఎడ్యుకేటర్ రాజ్‌కుమార్, కార్యాలయ సిబ్బంది పాలకుర్తి సదానందం, రామాంజనేయులు, చక్రపాణి పాల్గొన్నారు.
ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలి
కరీమాబాద్ : ఆరోగ్య సూత్రాలపై ప్రతిఒక్కరికి అవగాహన పెంచడానికి ఆరోగ్య కార్యకర్తలు కృషి చేయాలని వరంగల్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. సోమవారం ఉర్సులోని మెటర్నిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో సీకేఎం సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలాకుమారితోపాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీకేఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలాకుమారి మాట్లాడుతూ ఉర్సు ప్రసూతి వైద్యశాలలో సిబ్బందిని నియమించి సేవలు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తద్వారా సీకేఎం దవాఖానపై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.
అనంతరం డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవడంతోపాటు వారికి ప్రభుత్వ వైద్యంపై నమ్మకాన్ని పెంచాలని, సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ డోసు అందించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు, సంక్రమిత, అసంక్రమిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కలరా, టైఫాయిడ్, మలేరియా, చికెన్‌గున్యా, డెంగీ, విషజ్వరాల నుంచి ప్రజలను కాపాడడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఆర్‌ఆర్‌తోట, ఖిలావరంగల్, చింతల్, రంగశాయిపేట ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.