హనుమకొండ, జూలై 18 : భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ పర్యటన ముగిసింది. శనివారం సాయంత్రం హనుమకొండకు చేరుకున్న ఆయన హంటర్ రోడ్డులోని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో బస చేశారు. ఆదివారం ఉదయం రోడ్డు మార్గాన ములుగు, ఏటూరునాగారం మీదుగా భద్రాచలం వెళ్లి ముంపు బాధితులకు భరోసా కల్పించారు. అదేరోజు రాత్రి హంటర్‌రోడ్డులోని కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకుని అక్కడే బస చేశారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులతో హైదరాబాద్‌కు రోడ్డు మార్గాన వెళ్లారు.
సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు బయలుదేరే ముందు స్థానిక నేతలు కలుసుకున్నారు. అలాగే, పలువురి నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తకెళ్లపల్లి రవీందర్రావు, బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్లు సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుడా చైర్మన్ సంఘంరెడ్డి సుందర్రాజు యాదవ్, డీసీసీబీ చైర్మెన్ మార్నేని రవీందర్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
‘సాధన’ పుస్తకావిష్కరణ
రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం సాధన పుస్తకాన్ని కెప్టెన్ నివాసంలో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విశ్లేషణ తీరు బాగుందని అన్నారు. ఇలాంటి మరెన్నో పుస్తకాలను రచించాలని మెట్టు శ్రీనివాస్‌కు సూచించారు.