వరంగల్, జూలై15(నమస్తేతెలంగాణ) : జిల్లాలో ఆరు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఈ యేడు ఇప్పటివరకు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి జూలై 14 వరకు జిల్లా సగటు 27.65సెం.మీ కాగా, 53.18సెం.మీ కురిసింది. సాధారణం కంటే ఈ సంవత్సరం 53.28 శాతం అధికంగా నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు మత్తళ్లు పోస్తుండగా, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా ఖానాపురం మండలంలో 83.44 సెం.మీ, అత్యల్పంగా వర్ధన్నపేట మండలంలో 37.64సెం.మీ కురిసింది. వానలకు జిల్లా వ్యాప్తంగా నాలుగు చెరువుల కట్టలకు బుంగలు పడగా.. ఐదు చోట్ల కెనాళ్లకు గండ్లు పడ్డాయి. పలు చోట్ల పంటలు నీటమునిగాయి. మూడు ఇళ్లు పూర్తిగా, 51 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలగా, రోడ్లు ధ్వంసమయ్యాయి. వరద నష్టంపై అంచనాను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేయిస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది వానకాలం ఇప్పటివరకు సాధారణం కంటే 53.28 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటి నుంచి గురువారం వరకు సగటున 53.18 సెం.మీ వర్షం కురిసింది. జూన్ 30 వరకు 20.10 సెం.మీ వర్షం పడితే ఈ నెలలో పద్నాలుగు రోజుల్లోనే 33.08 సెం.మీ నమోదైంది. జూన్ ఒకటి నుంచి జూలై 14 వరకు జిల్లాలో సగటు వర్షపాతం 27.65 సెం.మీ మాత్రమే. ఇందులో జూన్ 30 వరకు 141.6, జూలై 14 వరకు 13.49 సెం.మీ జిల్లా సగటు వర్షపాతం. ఈ ఏడాది జిల్లాలో అత్యధికంగా ఖానాపురం మండలంలో రికార్డు స్థాయిలో సగటు వర్షపాతం 83.44 సెం.మీ నమోదైంది.
చెన్నారావుపేట మండలంలో 60.79సెం.మీ, నల్లబెల్లిలో 58.07 సెం.మీ, గీసుగొండలో 50.02, సంగెంలో 50.16, వర్ధన్నపేటలో 37.64, రాయపర్తిలో 45.17, పర్వతగిరిలో 49.58, ఖిలావరంగల్‌లో 44.01, వరంగల్‌లో 46.54, దుగ్గొండిలో 56.25, నర్సంపేటలో 52.45, నెక్కొండలో 57.19 సెం.మీ కురిసింది. కొద్దిరోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాతో జిల్లాలో వాటిల్లిన నష్టంపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీని ప్రకారం మూడు మండలాల్లోని పన్నెండు గ్రామాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ఖానాపురం మండలంలోని పాకాల, అశోక్‌నగర్, ఖానాపురం, మంగళవారిపేట, బుధరావుపేట, ధర్మారావుపేట, నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, రంగాపురం, శనిగరం, ముచ్చింపుల, దుగ్గొండి మండలంలోని పొనకల్లు, నాచినపల్లి, దేశిపల్లి, ఖానాపురం అధిక నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదికలో తెలిపారు.
దెబ్బతిన్న చెరువులు, రోడ్లు..
ఏకధాటిగా కురిసిన వర్షాలతో జిల్లాలో కొన్ని చెరువుల కట్టలకు బుంగలు, ప్రాజెక్టుల కాల్వలకు గండ్లు పడ్డాయి. నెక్కొండ మండలం దీక్షకుంట పెద్దదామెర చెరువు కట్టపై బుంగ ఏర్పడింది. నర్సంపేట మండలం మాదన్నపేటలో దామెరకుంట గైడ్‌బండ్, వీర్ దెబ్బతిన్నాయి. దుగ్గొండి మండలం నాచినపల్లిలోని ఈదుల చెరువు కట్ట వాలు లోపలివైపు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. చెన్నారావుపేట మండలం లింగగిరిలోని అక్కల్‌దేవి చెరువు కట్టకు బుంగ పడింది. ఎస్సారెస్పీ డీబీఎం-40 కెనాల్‌కు దుగ్గొండి మండలం మందపల్లి వద్ద మూడుచోట్ల, నర్సంపేట మండలం మహేశ్వరం వద్ద, గీసుగొండ మండలంలోని హవేలికృష్ణానగర్ వద్ద గండ్లు పడ్డాయి.
నెక్కొండ మండలం చిన్నకోర్పోలు గ్రామం వద్ద వట్టివాగు ఆనకట్ట ఎడుమ కాల్వకు గండి పడింది. ఈ చెరువుల కట్టల బుంగలు, కాల్వల గండ్ల పూడ్చివేతకు యుద్ధప్రాతిపదికన జలవనరుల శాఖ ఇంజినీర్లు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల సహకారంతో తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. శాశ్వత మరమ్మతుల కోసం అంచనాలు రూపొందించారు. గీసుగొండ మండలం ఎలుకుర్తి-కొమ్మాల రోడ్డు దెబ్బతినడంతో పంచాయతీరాజ్ ఇంజినీర్లు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నల్లబెల్లి మండలంలో మూడు రహదారులు, గీసుగొండ మండలంలో ఒక రహదారి కాజ్వే, కల్వర్టుల మీదుగా వరద నీరు ప్రవహిస్తున్నది. దీంతో సదరు కాజ్‌వేలు, కల్వర్టుల వద్ద అధికారులు సూచికలు ఏర్పాటు చేశారు.
పాక్షికంగా ధ్వంసమైన ఇండ్లు 51..
భారీ వర్షాలతో జిల్లాలో 51 ఇండ్లు పాక్షికంగా, మూడు ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. మండలం వారీగా ఖానాపురంలో 16, నల్లబెల్లిలో 8, నర్సంపేటలో 2, నెక్కొండలో 2, రాయపర్తిలో 10, గీసుగొండ, వరంగల్, ఖిలావరంగల్‌లో ఒక్కొక్కటి, సంగెం, వర్ధన్నపేటలో మూడేసి, పర్వతగిరిలో 4 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాయపర్తి మండలంలో 2, ఖానాపురం మండలంలో ఒక ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదాఘాతానికి గురై రాయపర్తి, గీసుగొండ మండలాల్లో ఒక్కో గేదె చనిపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.
జిల్లావ్యాప్తంగా పదహారు విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. వీటిలో చెన్నారావుపేట, నల్లబెల్లిలో ఒక్కొక్కటి, దుగ్గొండిలో 3, రాయపర్తిలో 2, గీసుగొండలో 4, వర్ధన్నపేటలో 5 స్తంభాలు ఉన్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు వెల్లడించారు. ఈ పదహారు స్తంభాల్లో 11కేవీకి సంబంధించినవి 7, ఎల్టీ పోళ్లు 8 ఉన్నట్లు తెలిపారు. దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లిలో ఒక్కొక్కటి చొప్పున మూడు డీటీఆర్లు కూడా దెబ్బతిన్నట్లు ప్రకటించారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, డీటీఆర్‌ల స్థానంలో తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.