వరంగల్, జూలై 15 (నమస్తేతెలంగాణ): ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో పత్తి పంటలో నిలిచిన నీటిని వీలైనంత త్వరగా తీసేయాలని జిల్లా వ్యవసాయ అధికారి(జేడీఏ) ఉషాదయాళ్ రైతులకు సూచించారు. ప్రస్తుతం వర్షం ఆగిపోయినందున తగినంత తేమ ఉన్నప్పుడే గొర్రు సహాయంతో దున్నాలని, తద్వారా నేలలో గాలి సరఫరా కావడంతో పాటు పంటలో కలుపు మొక్కలను కూడా నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. జిల్లాలో ప్రధాన పంటల్లో పత్తి ఒకటి. ఇప్పటికే రైతులు ప్రస్తుత వానకాలంలో జిల్లాలో 1.12 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఇది మొలక దశలో ఉన్న సమయంలోనే కొద్ది రోజుల నుంచి జిల్లాలో ఏకధాటి వర్షాలు కురిశాయి. దీంతో పత్తి పంటలో వరద నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో జేడీఏ ఉషాదయాళ్ తమ శాఖ అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పత్తి పంటను పరిశీలించి వర్షాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలపై రైతులకు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పత్తి పంటలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై శుక్రవారం ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడారు.
పత్తి పంటలో బూస్టర్ డోస్ కింద ఎకరానికి 25 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేయాలని జేడీఏ సూచించారు. ఎరువులు నేల ద్వారా వేసే పరిస్థితులు లేనప్పుడు ఫోలియార్ అప్లికేషన్ పైపాటు పిచికారీగా పాలిఫీడ్, మల్టీ-కే, 10 కిలోల యూరియా గాని ఒక లీటరు నీటిలో కలిపి వారానికి రెండుసార్లు పిచికారీ చేస్తే పంట త్వరగా కోలుకుంటుందని ఉషాదయాళ్ సూచించారు. గడ్డి జాతి, ఆకు జాతి కలుపు నివారణకు పంట 20 నుంచి 25 రోజుల వయసులో క్విజలోపాప్ ఇథైల్ 2 మిలీ, పైరిథియోబ్యాక్ సోడియం 1.25 మిలీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలనిన్నారు. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటిలో లేదా కార్బండిజం, మ్యాంకోజెబ్ 2 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయడం, మొక్కల మొదళ్లలో 5 నుంచి 7 రోజుల వ్యవధిలో రెండుసార్లు పోస్తే నేల ద్వారా వచ్చే రోగాలను నివారించొచ్చన్నారు. ముందస్తు చర్యగా కార్బండిజం, మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా కార్బండిజం ఒక గ్రాము, వేపనూనె, పిప్రోనిల్ గాని నీటిలో కలిపి పిచికారీ చేస్తే పురుగులు, తెగుళ్ల బారి నుంచి పత్తి పంటను కాపాడుకోవచ్చని ఆమె తెలిపారు.
ముంపు నీటిని మక్కజొన్న తట్టుకోదు
మక్కజొన్న పంట ప్రస్తుతం మొలక దశ నుంచి మోకాళ్ల ఎత్తు దశలో ఉందని, మక్కజొన్న పంట మొలక దశలో ముంపు నీటిని తట్టుకోదని ఉషాదయాళ్ పేర్కొన్నారు. ఇది సున్నితమైన దశ అని, పంటలో ఉన్న నీటిని వీలైనంత త్వరగా తీసేయాలని సూచించారు. మక్కజొన్న పంటలో ముంపు నీటిని తీసేసిన తర్వాత ఎకరానికి 20 కిలోల యూరియా, 10 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్ వేయాలన్నారు. తేమ ఉన్నప్పుడు అంతర సేద్యం, నాగలితో మొక్కల సాళ్లలో దున్నడం ద్వారా కలుపు మొక్కలను నివారించడంతోపాటు తగినంత గాలి నేల ద్వారా మొక్కలకు అందుతుందని వివరించారు.
మట్టి కూడా మొక్కల మొదళ్ల చుట్టూ తోయబడుతుందని, గట్లు, కాల్వలూ ఏర్పడుతాయని వెల్లడించారు. ఎరువులు నేల ద్వారా వేసే పరిస్థితులు లేనప్పుడు పొటాషియం నైట్రేట్, పాలిఫీడ్ నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా పోషకాలను పైపాటుగా అందించాలని ఉషాదయాళ్ రైతులకు సూచించారు. సోయా చిక్కుడు పంట ఇరవై రోజుల దశలో ఉన్నందున బూస్టర్ డోస్ కింద ఎకరానికి 20 కిలోల యూరియా, 10 కిలోల మ్యురేట్ ఆఫ్ పోటాష్‌ను పంటలో నీటిని తీసేసిన తర్వాత వేయాలని ఆమె తెలిపారు. ఎరువులు నేల ద్వారా వేసే అవకాశం లేనప్పుడు పోలియార్ అప్లికేషన్ పైపాటు పిచికారీగా యూరియా, పొటాషియం నైట్రేట్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. ప్రస్తుత వాతావరణం చార్కోల్ రాట్ రోగం రావడానికి అనుకూలమైనందున కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటిలో కలిపి మొక్కల మొదళ్లలో పోయాలని ఆమె సూచించారు.
పంటలను పరిశీలించిన జేడీఏ
చెన్నారావుపేట: మండలంలోని అమీనాబాద్‌లో వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మక్కజొన్న, వరి, ఇతర పంటలను జేడీఏ ఉషాదయాళ్ శుక్రవారం పరిశీలించారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు.