నల్లబెల్లి, జూలై 15: పంటల రక్షణకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్వవసాయాధికారి పరమేశ్వర్ అన్నారు. వర్షాలకు మండలంలో రైతులు సాగు చేసిన పంటలు నీట మునిగి ఎరుపు బారి పోయినందున మండలంలోని కొండైల్పల్లె, నల్లబెల్లి గ్రామాల్లో సాగైన పత్తి, మొక్కజొన్న పంటలను శుక్రవారం ఏవో పరిశీలించారు. పంటలను రక్షించుకోవడంలో మండల రైతాంగం మెళకువలు పాటించాలన్నారు. ప్రధానంగా వర్షాకాలంలో పంట భూముల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపటాలన్నారు. అలాగే కాపర్ ఆక్సీ క్లోరైడ్, స్ట్రెప్తోసైక్లిన్ కలిపి మొక్కల మొదళ్ల వద్ద డ్రెంచింగ్ చేయ డంతో పాటు ఇదే మందును పిచికారి చేయాలని సూచిం చారు.
అలాగే 19:19, 19 నుంచి 70 గ్రాములు ఒక పంపునకు కలిపి పిచికారి చేయాలన్నారు. బూస్టర్ డోస్ గా 25 కిలోల యూరియా ఎకరం పంటకు వేయాలని తెలిపారు. అలాగే మెరప నార్లు పోసిన రైతులు నారు మడుల మీద వరి గడ్డి గాని ప్లాస్టిక్ కవర్లు వేసి వర్షం నుంచి నారుకు రక్షణ కల్పించాలన్నారు. ఇదిలా ఉంటే రైతులు సాగు చేసిన పంటల వివరాలను సర్వే నెంబర్ల వారిగా సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారులకు అందజేయా లన్నారు. ఏఈవో శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.
పంటల సాగులో రైతులు మెళకువలు పాటించాలి
వర్ధన్నపేట : పంటల సాగులో రైతులు మెళకువలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని ఏవో రాంనర్సయ్య సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రైతుల పొలాలను పరిశీలించారు. అలాగే దమ్మన్నపేటలో భూముల్లో భాస్వరాన్ని తగ్గించేందుకు ఉపయోగించాల్సిన జీవన ఎరువుల వాడకం విధానంపై ఏఈవో కావ్యతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా క్లస్టర్ల ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.